Balloon War : కొరియా దేశాల మధ్య బెలూన్ వార్, సియోల్ సరికొత్త ప్రయోగం
South Korea: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య బెలూన్ల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. సియోల్ నుంచి సరికొత్తబెలూన్లు ప్రయోగిస్తున్నారు. రహస్య సమూహం 'స్మార్ట్ బెలూన్‌లను' అభివృద్ధి చేశారు.
North Korea Vs South Korea: ఉత్తర కొరియా(North Korea), దక్షిణ కొరియా(South Korea) దేశాల మధ్య బెలూన్ వార్‌ఫేర్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్(Seoul)కు చెందిన ఒక వర్గం సరిహద్దులో వందల కిలోమీటర్ల వరకు కరపత్రాలు, ఎలక్ట్రానిక్ స్పీకర్లను చెదరగొట్టగల సామర్థ్యం ఉన్న స్మార్ట్ బెలూన్ల(Smart Balloon)ను అభివృద్ధి చేసింది. ఆన్‌లైన్‌లో లభించే 3D ప్రింటర్‌లు, కాంపోనెంట్‌లను ఉపయోగించి వీటిని రూపొందించారు. వీటిలో GPS-ట్రాకింగ్‌ను కూడా అమర్చారు. ఈ "స్మార్ట్ బెలూన్`` లు తయారు చేసేందుకు 1,000 అమెరికన్ డాలర్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం.
నెలకు ఒకటి లేదా రెండుసార్లు ఇరు దేశాల్లోని రహస్య సమూహం బెలూన్లను ఎగురవేస్తుంది. ఎక్కువగా చీకటి ఉన్న సమయంలో ఈ బెలూన్లు ఎగుర వేస్తున్న విషయం తరచుగా వార్తల్లోనూ కనిపిస్తోంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌తో సహా ఉత్తర కొరియాలోకి కార్గోలను వదలడం పరిపాటిగా మారింది. ఇక, ఇప్పుడు సుదూర లక్ష్యంతో కూడిన బెలూన్లను ప్రయోగిస్తున్నారు. ఇవి చైనా వరకు ఎగురుతున్నట్టు తెలిసింది.
"మా స్మార్ట్ బెలూన్‌లు ఖరీదైనవి. ఇతర సమూహాలు ఎగురవేసే బెలూన్‌ల కంటే ఇవి వంద రెట్లు ఎక్కువ శక్తివంతమైనవి" అని "ది కమిటీ ఫర్ రిఫార్మ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ జోసన్`` గ్రూప్‌లోని ఒక సభ్యుడు తెలిపారు. `జోసన్` అనేది ఉత్తర కొరియాకు పర్యాయ పదంగా పేర్కొన్నారు. ఈ గ్రూపులో 30 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా విరాళాల ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నారు. గత నెల చివరి నుండి రెండు కొరియా దేశాల మధ్య బెలూన్ల వ్యవహారం తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియా ఇటీవలి సంవత్సరాలలో బెలూన్‌లను ఎక్కువగా ప్రయోగించింది. దాదాపు 1,000 కంటే ఎక్కువ బెలూన్లను దక్షిణ కొరియాపైకి విడిచి పెట్టింది. వీటిలో చెత్త, కొన్ని జంతువుల మలాలను చేర్చి దక్షిణా కొరియాపైకి విడిచి పెట్టారు.
1950-1953 మధ్య కొరియా దేశాల నడుమ కొనసాగిన యుద్ధం.. ఆ తర్వాత ఒప్పందంతో విరమించారు. ఈ శాంతి ఒప్పందం కొనసాగిస్తూనే మరోవైపు.. సాంకేతికంగా ఈ రెండు దేశాలు పరోక్షంగా యుద్ధం చేసుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దక్షిణ కొరియా 2018 తర్వాత మొదటిసారిగా ఉత్తరాది వైపు లౌడ్‌స్పీకర్ ప్రసారాలను పునఃప్రారంభించింది.
బెలూన్ల ప్రభావంపై చర్చ
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న బెలూన్‌ల యుద్ధం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇవి ఎంత ప్రభావవంతంగా ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారాయి. అవి ఎక్కడ దిగుతాయి, వాటి గురించి సగటు ఉత్తర కొరియన్లు ఏమనుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ది కమిటీ ఫర్ రిఫార్మ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ జోసన్ సభ్యుడు మాట్లాడుతూ, దక్షిణ కొరియా నుండి వచ్చిన బెలూన్‌లపై ప్యాంగ్యాంగ్(ఉత్తర కొరియా రాజధాని) రగిలిపోతోందని, ఇదే తమను ప్రోత్సహించిందని తెలిపారు. బెలూన్‌లు, వాటిలో అమర్చే వారి పేలోడ్‌లు తమ ఆగ్రహానికి ప్రతీకలుగా ఉన్నాయని తెలిపారు. అయితే.. తాము చేసే ఈ చర్యలు రహస్యంగానే సాగుతున్నాయని వివరించారు.
పెలోడ్లు
దక్షిణ కొరియాకు చెందిన ది కమిటీ ఫర్ రిఫార్మ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ జోసన్ సంస్థ సభ్యులు తయారు చేస్తున్న బెలూన్లలో పెలోడ్లు అమరుస్తున్నారు. ఇవి హైడ్రోజన్‌తో నిండి ఉండాయి. స్మార్ట్ బెలూన్‌లు 7.5 కిలోల వరకు పేలోడ్‌లను మోయగలవు. సియోల్‌లోని ఒక చిన్న అద్దె అపార్ట్‌మెంట్‌లో, బృందం తెల్లటి ప్లాస్టిక్ బాక్సులను, కొన్ని కనెక్టివ్ భాగాలను రూపొందించేందుకు 3D ప్రింటర్‌లను ఉపయోగిస్తోంది. చైనీయులు, దక్షిణ కొరియా ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుండి కొనుగోలు చేసిన వైర్లు, సర్క్యూట్ బోర్డ్‌లు, టైమర్‌లు బెలూన్‌ల కంటెంట్‌ల వ్యాప్తిని నియంత్రించే పరికరాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ బెలూన్‌ల ద్వారా ఒకేసారి 25 కరపత్రాలను వెదజల్లడానికి అవకాశం ఉందని సభ్యుడు తెలిపారు. దీనిని ముందే ప్రోగ్రామ్ చేస్తామన్నారు.
ఈ సంవత్సరం, కొన్ని బెలూన్లు ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌ను విమర్శిస్తూ ముందే రికార్డ్ చేసిన సందేశాలను వినిపించే చిన్న పారాచూట్‌లకు జోడించిన స్పీకర్లను మోసుకెళ్లాయి. ఒక సాధారణ కార్గో ఆరు స్పీకర్లు, ఆరు ఇతర బండిల్‌లు కలిగి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్క బెలూన్‌లోనూ షార్ట్-వేవ్ రేడియో ఉంటుందని చెప్పారు. లాంతరు ఆకారపు స్పీకర్ పరికరాలను వాటర్‌ప్రూఫ్ బాక్స్, లిథియం-అయాన్ బ్యాటరీలు, యాంప్లిఫైయర్ ఉపయోగించి నిర్మించారు. స్పీకర్ పైభాగంలో మూడు చిన్న రెయిన్‌బో-రంగు పారాచూట్‌లు ఉంటాయి. అయితే ఫోమ్ బేస్ ఏదైనా ల్యాండింగ్ ను గ్రహించడంలో సహాయపడుతుంది. వారు ఉత్తర కొరియా యాసలో రికార్డ్ చేసిన 15 నిమిషాల ఉత్తర కొరియా పాటలు, సందేశాలను పంపిస్తున్నారు. బెలూన్లలో ఏర్పాటు చేసే బ్యాటరీలు 5 రోజుల వరకు పనిచేస్తాయని తెలిపారు.
"వర్కర్స్ పార్టీని వదిలేయండి. అప్పుడే ఉత్తర కొరియా మనుగడ సాగించగలదు. కిమ్ జోంగ్ ఉన్ ఏకీకరణను వ్యతిరేకించే ద్రోహి" అని రికార్డింగ్‌లో పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలలో చేసిన మరో కీలక సాంకేతిక పురోగతి `ఆల్టిమీటర్-లింక్డ్ వాల్వ్`. ఇవి బెలూన్‌లు చాలా ఎత్తుకు వెళ్లకుండా స్వయంచాలకంగా నిరోధిస్తాయి. బెలూన్‌లు దక్షిణ కొరియా సరిహద్దుకు ఉత్తరాన కొన్ని డజన్ల కిలోమీటర్ల కంటే ఎక్కువ ముందుకు వెళ్లేలా రూపొందించారు. పాత తరహా బెలూన్‌ల కంటే ఇవి మరింత మెరుగ్గా పనిచేస్తున్నాయి.
పుష్ బ్యాక్!
దక్షిణ కొరియా నుంచి కొన్ని సమూహాలు క్రమం తప్పకుండా ఉత్తర కొరియాకు బెలూన్‌లను పంపుతున్నట్టు అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం ఒకప్పుడు దాని స్వంత కరపత్రాలను పంపింది. కానీ, దశాబ్దం క్రితం ఈ పద్ధతిని వదిలివేసింది. జాతీయ భద్రతా కారణాలతో 2020లో బెలూన్లను ఎగురవేయడాన్ని నిషేధించారు. అయితే గత సెప్టెంబరులో ఓ న్యాయస్థానం ఆ నిషేధాన్ని కొట్టివేసింది, ఇది వాక్ స్వాతంత్య్రానికి, రాజ్యాంగ హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీంతో అప్పటి నుంచి మళ్లీ బెలూన్ల ను ప్రయోగించడం.. ప్రారంభించారు.
కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర కొరియా అధికారులు దక్షిణ కొరియా కరపత్ర కార్యకర్తలను "హ్యూమన్ స్కమ్" అని పేర్కొన్నారు. 2020లో, కరపత్రాలపై గొడవ సమయంలో ఇరు దేశాల మధ్య ఉన్న కొరియా అనుసంధాన కార్యాలయాన్ని కూల్చివేశారు. 2022లో ఈ "గ్రహాంతర వస్తువులు" కరోనా వైరస్‌ను మోసుకెళ్లగలవని వారు పేర్కొన్నారు.
దక్షిణ కొరియాలో ఈ బెలూన్ల వ్యవహారం అంతర్గత వివాదాలకు కూడా దారి తీసింది. కొన్ని సమూహాలు ఘర్షణ పడ్డాయి. బెలూన్‌లు ఘర్షణాత్మకంగా ఉన్నాయని, ప్రమాదంలో పడేస్తున్నాయనే వాదన తెరమీదికి వచ్చింది. సరిహద్దుకు సమీపంలో ఉన్న దక్షిణ కొరియా నుంచి ప్రయోగాలు నిర్వహించవద్దని `స్మార్ట్ బెలూన్ గ్రూప్` కు గతంలో మౌఖిక హెచ్చరికలు కూడా జారీ చేశారు. మొత్తంగా చూస్తే.. ఇరు దేశాల మధ్య ఈ బెలూన్ల రగడ అయితే కొనసాగుతూనే ఉంది.