Las Vegas shooting: అమెరికాలో మరో సారి కాల్పుల మోత, ముగ్గురు మృతి
University of Nevada: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాస్ వెగాస్‌లోని నెవాడా యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో బుధవారం ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు.
Shooting In USA: అమెరికా (United States) మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాస్ వెగాస్ (Las Vegas)లోని నెవాడా యూనివర్సిటీ (University of Nevada) ప్రధాన క్యాంపస్‌లో బుధవారం ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరొ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాల్పులకు పాల్పడిన నిందితుడు సైతం మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎలా చనిపోయాడో స్పష్టత లేదు. పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటన అనంతరం పోలీసులు యూనివర్సిటీని ఖాళీ చేయించారు. మృతుల వివరాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
ఘటనపై లాస్ వెగాస్ మెట్రోపాలిటర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘యూనివర్సిటీలో ముగ్గురి మృతదేహాలను గుర్తించాం. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అతని పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయినవారిలో కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
కాల్పుల నేపథ్యంలో నెవాడా విశ్వవిద్యాలయం సహా అన్ని ఇతర దక్షిణ నెవాడా విద్యాసంస్థలను బుధవారం మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయం సమీపంలోని రహదారులను మూసివేశారు. లాస్ వెగాస్ స్ట్రిప్‌కు తూర్పున రెండు మైళ్ల కంటే తక్కువ దూరంలో నెవాడా విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ దాదాపు 25,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 8,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరల్ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
రెండు రోజుల క్రితం కాల్పుల్లో ఐదుగురు మృతి
రెండు రోజుల క్రితం అమెరికాలోని ఓచార్డ్స్ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. నార్త్ పోర్ట్ లాండ్ కు18 మైళ్ల దూరంలో ఓచార్డ్స్ లోని ఓ ఇంటిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంట్లోని వారికి హానిని తలపెడతామంటూ ఓ కుటుంబ సభ్యుడికి ఆగంతకుడి నుంచి టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమయిన పోలీసులు స్వ్కాడ్, మెడికల్ సిబ్బందిని తీసుకుని వారి ఇంటికి వెళ్లారు. డ్రోన్ సహాయంతో ఇంట్లోకి తొంగి చూడగా కుటుంబ సభ్యులు అప్పటికే రక్తపు మడుగులో పడి కనిపించారు.
అక్టోబర్ చివరి వారంలో 22 మంది..
అమెరికాలోని లివిన్‌స్టన్, మైనే లూయిస్ టన్‌లో అక్టోబర్ 25న కాల్పులు జరిగాయి. ఈ దాడిలో 22 మంది మరణించారు. 50 నుంచి 60 మందికి పైగా గాయపడ్డారు. నగరమంతటా మూడు వేర్వేరు ప్రదేశాల్లో కాల్పులు జరిగాయి. సన్ జర్నల్ వార్తాపత్రిక ప్రకారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మొల్లిసన్ వేలోని స్పేర్‌టైమ్ రిక్రియేషన్‌లో రాత్రి 7:15 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మొదట కాల్పులు జరిగాయి.
కొద్దిసేపటి తర్వాత, లింకన్ స్ట్రీట్‌లోని స్కీంగీస్ బార్ & గ్రిల్ రెస్టారెంట్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఆపై ఆల్ఫ్రెడ్ ఎ ప్లోర్డ్ పార్క్‌వేలోని వాల్‌మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో కాల్పుల సంఘటన జరిగాయి. షెరీఫ్ కార్యాలయం అనుమానితుడి ఫొటోలను విడుదల చేసింది. అందులో ఒక వ్యక్తి రైఫిల్ పట్టుకుని కాల్పులు జరుపుతూ కనిపించాడు. కాల్పులు జరిపేందుకు వచ్చిన వాహనం ఫోటోను కూడా లూయిస్టన్ పోలీసులు విడుదల చేశారు.