Global Dream 2 Cruise Ship : రూపంలోనే కాదు ట్రాజెడీలోనూ టైటానిక్ కంటే పెద్దదే - సముద్రంలోకి వెళ్లకుండానే ముక్కలవుతున్న క్రూయిజ్ !
టైటానిక్ సముద్రంలో ప్రయాణం ప్రారంభించిన తర్వాత మునిగిపోయింది. కానీ అంత కంటే పెద్ద క్రూయిజ్ ఒకటి ప్రయాణం ప్రారంభించకముందే ముక్క చెక్కలవుతోంది.
Global Dream 2 Cruise Ship : టైటానిక్ గురించి మనందరికీ తెలుసు. అంత పెద్ద క్రూయిజ్ మునిగిపోవడం సినిమాల్లో చూశాం. అదో ట్రాజెడి. అయితే టైటానిక్ కంటే పెద్ద క్రూయిజ్ ఇప్పుడు రెడీ అయింది. కానీ ఈ క్రూయిజ్‌ది మరో విషాదకథ. అసలు సముద్రంలో జర్నీ ప్రారంభించకుండానే ముక్కలవుతోంది. కష్టపడి నిర్మించి.. తుక్కు కింద అమ్మేయానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ?
రూ. 9 వేల కోట్లు పెట్టి క్రూయిజ్ నిర్మించి దివాలా తీసిన కంపెనీ
జర్మనీకి చెందిన వెర్ఫ్‌టెన్ సంస్థ భారీ క్రూయిజ్‌లను తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఈ సంస్త గ్లోబల్ డ్రీమ్-1 అనే క్రూయిజ్ తయారు చేసింది. మంచి పేరు రావడంతో దాని కంటే భారీగా గ్లోబల్ డ్రీమ్ 2 క్రూయిజ్‌ను నిర్మించింది. 20 అంతస్తులతో దాదాపు 9 వేల మంది ప్రయాణికులు ప్రయాణించే వీలుగా వెర్ఫెటెన్ సంస్థ ఈ షిప్ నిర్మించింది. పూర్తి స్థాయి లగ్జరీ ఏర్పాట్లతో దాదాపుగా రూ. 9 వేల కోట్లను ఖర్చు చేసింది. అయితే పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే మరో రూ. మూడు వేల కోట్లు అవసరం. కానీ అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. వెర్ఫ్‌టెన్ సంస్థ దగ్గర నిధులన్నీ ఖాళీ అయిపోయాయి. మిగిలిన నిర్మాణానికి కావాల్సిన డబ్బులను సమకూర్చడంలో సంస్థ విఫలమైంది. అప్పటికే అన్ని రకాల అప్పులు చేయడంతో ... బ్యాంకులు, ఆర్థిక సంస్థలుకూడా సారీ చెప్పేశాయి.
కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తుక్కుగా అమ్మేసే ప్రయత్నాలు
సరే ఎవరికైనా అమ్మేసి... వచ్చిన అడ్వాన్స్‌లతో నిర్మించి.. మిగిలిన డబ్బులు వెనకేసుకుందామని అనుకుంది కానీ.. ఎవరూ ముందుకు రాలేదు. కొవిడ్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటుపడ్డ జనాలు.. పూర్తిగా జనాల్లో కలిసేందుకు జంకుతున్నారు. ఈ కారణంగా భారీ క్రూయిజ్ షిప్‌లకు డిమాండ్ లేకుండా పోయింది. ఈ కారణంగా కరోనా కంటే ముందు ఈ షిప్‌ను కొనేందుకు పోటీపడ్డ కంపెనీలు.. ఇప్పుడు చేతులెత్తేశాయి. ఒకవైపు షిప్ అమ్ముడుపోక.. మరోవైపు అప్పులిచ్చిన బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో దివాళా తీస్తున్నట్లు వెర్ఫ్‌టెన్ కంపెనీ ఈ ఏడాది మొదట్లో ప్రకటించింది. ఈ సంస్థను యుద్ధనౌకలు తయారు చేసే తైసన్‌క్రూప్ అనే నావల్ యూనిట్ దక్కించుకుంది.
కొనేవాళ్లుంటే ఇప్పటికీ ఆ సంస్థ రెడీ.. లేకపోతే ముక్కలే
ఇప్పుడు ఆ సంస్థ.. ఈ క్రూయిజ్‌లను అడ్డం తీస్తే తమ యుద్ధ నౌకలు తాము తయారు చేసుకుంటామని తేల్చి చెప్పింది. ఎలాగోలా బతిమాలి 2023 వరకు ఒపిక పట్టేలా అంగీకరింప చేసుకుంది వెర్సటెన్. ఇప్పుడు ఆ లోపే గ్లోబల్ డ్రీమ్-2 షిప్‌ను ఎవరికైనా అమ్మేయాలని వెర్ఫ్‌టెన్ సంస్థ నిర్ణయించుకుంది. కానీ దాన్ని కొనుగోలు చేసేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. గడువు పూర్తయ్యే సమయానికి కూడా ఎవరూ రాకపోతే తుక్కు కింద అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఒక వేళ అదే జరిగితే ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ నౌక.. తొలి ప్రయాణం చేయకముందే కనుమరుగైపోతుంది. అంటే టైటానిక్ కన్నా మహా విషాదమన్నమాట.