Bangladesh Protests: బంగ్లాదేశ్ బాధితులకు ఆశ్రయమిస్తాం, బెంగాల్ సీఎం మమతా సంచలన ప్రకటన
Bangladesh Crisis: బంగ్లాదేశ్ అల్లర్లపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితులు బెంగాల్‌కి వస్తే ఆశ్రయమిస్తామని వెల్లడించారు.
Bangladesh Quota Row: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల కోటాపై పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వెయ్యి మందికి పైగా భారతీయ విద్యార్థులు ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇప్పట్లో అక్కడ పరిస్థితులు సద్దుమణిగేలా లేవు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో హింసకు అల్లాడిపోతున్న బాధితులు బెంగాల్‌లో ఆశ్రయం పొందేందుకు వస్తే ఆహ్వానిస్తామని వెల్లడించారు. వాళ్లు ఎప్పుడైనా బెంగాల్‌కి రావచ్చని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగే అల్లర్లపై తాను ఏమీ మాట్లాడలేనని, కానీ ఎవరైనా నిస్సహాయ స్థితిలో బెంగాల్‌కి వస్తే మాత్రం కచ్చితంగా ఆశ్రయం ఇస్తామని ప్రకటించారు. కోల్‌కత్తాలో జరిగిన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"బంగ్లాదేశ్‌లోని అల్లర్లపై నేనేమీ మాట్లాడలేను. కేంద్ర ప్రభుత్వమే దాని గురించి మాట్లాడుతుంది. కానీ అక్కడి బాధితులు నిస్సహాయ స్థితిలో బెంగాల్ తలుపులు తడితే మాత్రం కచ్చితంగా ఆశ్రయమిస్తాం. పొరుగు దేశాలకు సాయం చేయాలని ఐక్యరాజ్య సమితి తీర్మానంలోనే ఉంది. అక్కడి అల్లర్లలో చిక్కుకున్న బెంగాల్ పౌరులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం"
- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
ఇదే కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించారు మమతా బెనర్జీ. యూపీలో బీజేపీకి కళ్లెం వేసి ఆ స్థాయిలో సీట్లు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. ఏజెన్సీలను అడ్డు పెట్టుకుని బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఓడిపోయిందని మండి పడ్డారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అఖిలేష్‌కి థాంక్స్ చెప్పారు. అన్ని రాష్ట్రాలతోనూ సఖ్యంగా ఉండాలనే కోరుకుంటామని వెల్లడించారు.
West Bengal: At TMC's rally in Kolkata, CM Mamata Banerjee says "I want to thank Akhilesh ji, you have accepted my invitation. I want the relationship of Bengal to be better with the entire country. I want to say the 'Khel' that you showed in UP, they (BJP) should have resigned… pic.twitter.com/YrHuJRNelI
— ANI (@ANI) July 21, 2024
ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. రాజధాని ధాకాలో ఈ అల్లర్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మిలిటరీ భారీ ఎత్తున మొహరించింది. ఇప్పటి వరకూ ఈ ఘర్షణల్లో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. 1971 నాటి స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్‌లు కల్పిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఈ అల్లర్లు మొదలయ్యాయి. అయితే...ఆందోళనలు ఆపేసి విద్యార్థులంతా కాలేజ్‌లకు వెళ్లాలంటూ అక్కడి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే నెల ఈ అంశంపై సుప్రీంకోర్టు ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ లోగా దేశమంతా అల్లర్లు మొదలయ్యాయి. ఈ స్కీమ్‌ని మళ్లీ అమలు చేయడం అక్రమమని అటార్నీ జనరల్ తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం తీసుకోకపోవడమే మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Also Read: Viral News: రీల్స్ కోసం కెమెరా కొనాలని పని చేస్తున్న ఇంట్లోనే దొంగతనం, చివరకు అరెస్ట్