Viral News: రీల్స్ కోసం కెమెరా కొనాలని పని చేస్తున్న ఇంట్లోనే దొంగతనం, చివరకు అరెస్ట్
Delhi News: ఢిల్లీలో ఓ పని మనిషి రీల్స్ చేసేందుకు కెమెరా కొనాలని పని చేస్తున్న ఇంట్లోనే చోరీ చేసింది. లక్షల విలువ చేసే ఆభరణాలు దొంగతనం చేసింది.
Crime News: రీల్స్, షార్ట్స్ చేసి ఫేమస్ అవ్వాలనే తొందరలో కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఓ యువతి రీల్ చేస్తూ ఓ లోయలో పడి మృతి చెందింది. ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు కుర్రాళ్లు వర్షంలో రీల్స్ చేస్తూ కింద పడిపోయారు. ఈ ఘటనలో ఓ యువకుడు చనిపోయాడు. రీల్స్ మోజులో ఇలా బలి అవుతున్నారు. ఇంకొందరు రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఢిల్లీలోని ద్వారకాలో ఓ పని మనిషి రీల్స్ కోసం దొంగతనం చేసింది. రీల్స్ చేయడానికి కెమెరా కొనుక్కోవాలనుకుంది. కానీ అంత డబ్బుల్లేవు. అందుకే పని చేస్తున్న ఇంట్లోనే దొంగతనం చేయాలనుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లో ఉన్న బంగారం, వెండి చోరీ చేసింది. జులై 15వ తేదీన ఈ చోరీ జరిగింది. ఇంట్లో వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోల్డ్ బ్రేస్‌లెట్‌తో పాటు వెండి గొలుసు చోరీకి గురయ్యాయని కంప్లెయింట్ ఇచ్చారు. పని మనిషిపైనే అనుమానం ఉందని చెప్పారు. ఈ వివరాలన్నీ నమోదు చేసుకున్న పోలీసులు పని మనిషి నంబర్‌కి కాల్ చేశారు. స్విచాఫ్ రావడం వల్ల అనుమానాలు రెట్టింపయ్యాయి.
అడ్రెస్ కూడా ఫేక్ అని తెలిసింది. ఆ తరవాత పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మొత్తానికి ఆ పని మనిషి అడ్రెస్ కనుక్కున్నారు. ఆమె బ్యాగ్ తీసుకుని పారిపోతుండగా అరెస్ట్ చేశారు. ఆ తరవాత పోలీసులు విచారణ మొదలు పెట్టారు. తమది రాజస్థాన్ అని, భర్త డ్రగ్స్‌కి బానిసయ్యాడని నిందితురాలు చెప్పింది. రోజూ కొట్టే వాడని అందుకే ఢిల్లీకి వచ్చానని వివరించింది. పని చేసుకుంటూనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. రీల్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకోవాలనుకుంది. అయితే..DSLR కెమెరాతో అయితే క్వాలిటీ బాగుంటుందని ఎవరో సలహా ఇచ్చారు. ఈ కెమెరా కొనేంత డబ్బు లేక దొంగతనం ప్లాన్ చేసింది. ఇంట్లో లక్షల విలువ చేసే ఆభరణాలున్నాయని చూసి వాటిని చోరీ చేసి చివరకు దొరికిపోయింది.
Also Read: Union Budget: బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష భేటీ, కన్వార్ యాత్ర సహా పలు అంశాలపై చర్చ