Rahul Gandhi: 'మహిళా కోటా కోసం పదేళ్లు ఆగాలా? కుల గణనకు భయమెందుకు మోదీజీ? ' - రాహుల్ గాంధీ
Rahul Gandhi: మహిళ రిజర్వేషన్ బిల్లు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు.
![Rahul Gandhi: 'మహిళా కోటా కోసం పదేళ్లు ఆగాలా? కుల గణనకు భయమెందుకు మోదీజీ? ' - రాహుల్ గాంధీ Why PM Narendra Modi afraid of caste census: Rahul Gandhi Rahul Gandhi: 'మహిళా కోటా కోసం పదేళ్లు ఆగాలా? కుల గణనకు భయమెందుకు మోదీజీ? ' - రాహుల్ గాంధీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/faada8f8e6d794a3564ac463af3df8f61695474626632798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rahul Gandhi: మహిళ రిజర్వేషన్ బిల్లు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. జైపూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తక్షణమే కుల గణనను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కుల గణన లేకుండా ఓబీసీలకు తగిన భాగస్వామ్యం కల్పించడం సాధ్యం కాదని అన్నారు. ప్రధాని 24 గంటలు ఓబీసీల గురించి మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు కుల గణనకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కులగణన అంశాన్ని తాను పార్లమెంట్‌లో లేవనెత్తినప్పుడు బీజేపీ ఎంపీలు తన గళాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
‘ఎక్స్‌రే లాంటిదే కులగణన’
ఎవరికైనా గాయం అయినప్పుడు వారిని ఆసుపత్రికి తీసుకువెళ్తారని, ఫ్రాక్చర్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఎక్స్-రే తీయించుకోమని చెప్తారని రాహుల్ గాంధీ అన్నారు. ఒక రకంగా కుల గణన కూడా ఒక ఎక్స్-రే లాంటిదేనని అభిప్రాయపడ్డారు. కలగణన దేశంలో ఎవరెవరు ఉన్నారు? దేశంలో ఎంత మంది మహిళలు, OBC, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ఉన్నారో తెలుసుకోవడానికి సహాయపడుతుందన్నారు. జనాభా గణన పేరుతో రిజర్వేషన్ల అమలు వాయిదా వేయడం దారుణమన్నారు.
‘అందుకే నా సభ్యత్వం రద్దు చేశారు’
బీజేపీ- కాంగ్రెస్ మధ్య సిద్ధాంతాల విషయంలో పోరు జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్‌లో తాను అదానీపై ప్రసంగించినప్పుడే తన లోక్సభ సభ్వత్వం రద్దయ్యిందని గాంధీ దుయ్యబట్టారు. ఇండియా పేరును భారత్గా మార్చేందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారని, కానీ అది వాయిదా వేసుకుని మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయవచ్చన్నారు.
‘తక్షణం అమలు చేయాలి’
అయితే డీలిమిటేషన్, కొత్త జనాభా లెక్కల సాకుతో 10 ఏళ్లపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రిజర్వేష్లను ఈ రోజే అమలు చేయాలని కోరుకుంటోందన్నారు.యజైపుర్లోని మహారాణి కళాశాలలో ప్రతిభ కనబరిచిన యువతకు రాహుల్ గాంధీ ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం వారు స్కూటర్ నడుపుతుండగా.. వెనుక కూర్చొని జైపుర్ వీధుల్లో ప్రయాణించారు.
రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరం
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. తాము మహిళా బిల్లు తెచ్చినప్పుడు బీజేపీ వ్యతిరేకించిందని, ఇప్పుడు అదే పార్టీ బీజేపీ మహిళా రిజర్వేషన్ తెచ్చిందని ప్రచారం చేసుకుంటోందని అన్నారు. బీజేపీ కొత్త పార్లమెంట్ కట్టామని నటీనటులను, తదితరులను పిలిచి చూపించారని, పార్లమెంట్ అంటే ప్రజా సమస్యలపై చర్చించే వేదికని అన్నారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి నటీమణులను ఆహ్వానించారని, కానీ రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం అవమానకరం అన్నారు.
ఇదే పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసినప్పుడు అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అంటరాని వ్యక్తి కాబట్టి అహ్వానించలేదని తీవ్ర స్థాయిలో ఖర్గే ఆరోపణలు గుప్పించారు. పార్లమెంట్ ఏమైనా ప్రదర్శనశాలా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా బీజేపీ, ఈడీ, ఐటీ, సీబీఐ అనే నలుగురు అభ్యర్థులను మోదీ నిలబెట్టారని విమర్శించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)