Old Age Problems : వృద్దులు ఎందుకు మెల్లగా నడుస్తారు? వర్కౌట్స్ చేస్తే మార్పు వస్తుందా?
Telugu News: వయసు మళ్లినవారు మెల్లగా ఎందుకు నడుస్తారు అని "యూనివర్సిటీ ఆఫ్ కొలొరాడో " కొత్తగా పరిశోధన జరిపింది. కదలికపై మరిన్ని డిజార్డర్స్ ను సులభంగా డయగ్నోస్ చేయటానికి ఈ స్టడీ ఉపయోగపడనుంది.
New Study On Old Age Problems: వయసు పెరుగుతున్న కొద్ది, శరీర కదలికలో వేగం తగ్గటం సర్వసాధారణం. మెటాబలిజం, కండరాల బలహీనత ఇందుకు కారణమని చెప్తూ ఉంటారు. యూనివర్సిటీ ఆఫ్ కొలొరాడో కొత్తగా నిర్వహించిన పరిశోధనలో, వయసైపోతున్న వారికి వయసులో ఉన్నవారి కంటే నడవటానికి ఎక్కువ శక్తి అవరమవుతుంది అని చెప్పారు. జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ ప్రచురణ ప్రకారం ఈ పరిశోధన పార్కిన్సన్ వంటి వ్యాధులను డయగ్నోస్ చేయటానికి కొత్త టూల్స్ కనిపెట్టడంలో సహాయపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉన్న 84 మంది వృద్ధులు, యుక్తవయసులో ఉన్న కొందరి మీద పరిశోధన జరిపినపుడు వాళ్లందర్నీ చేతిలో ఒక రొబోటిక్ హ్యాండ్ పట్టుకొని నడవమన్నారు. ఆ రోబోటిక్ హ్యాండ్ కంప్యూటర్ మౌస్ లా పనిచేస్తుంది.
టార్గెట్ ను చేరుకోవటానికి యుక్తవయసులో ఉన్నవారి కంటే వృద్ధులు శక్తిని కూడగట్టుకొని నడుస్తున్నట్టు వెల్లడైంది. గణాంకాల ప్రకారం వయసు పెరుగుతున్న కొద్ది కండరాల్లోని సెల్స్ బలాన్ని కోల్పోతూ ఉంటాయి. ఇది కదలిక మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల చిన్న పనులను పూర్తి చేయటానికి కూడా ఎక్కువ శక్తి అవసరం అవుతుంది.
ఈ స్టడీ వల్ల కలిగిన ప్రయోజనాలు
పార్కిన్సన్, కదలికకు సంబంధించిన మరిన్ని డిజార్డర్స్‌ను సులభంగా డయగ్నోస్ చేయటానికి ఈ స్టడీ మరింత ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్ది శారీరక కదలికలో వేగం చాలా తగ్గటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. ఇది శారీరకంగా ఇబ్బంది కలిగించటమే కాకుండా సోషల్ యాక్టివిటీస్ మీద కూడా నెగెటివ్ ప్రభావం చూపుతుంది. ఈ మార్పునకు కారణం కేవలం వయసు పెరగటమా? లోపల ఇంకేదైనా డిసీజ్ ఉందా? అనేది గుర్తించటం అవసరం. కదలికలో వేగం తగ్గటమనేది కేవలం వయసు పెరగటం వల్లనే కాదు, రకరకాల న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల కూడా ఇది జరుగుతుంది.
గుడ్ న్యూస్ ఏంటంటే..ఎక్సర్సైజ్ వల్ల పార్కిన్సన్, మరిన్ని ఏజ్ రిలేటెడ్ డిజార్డర్స్ నుంచి చాలామటుకు ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయటం వల్ల ఈ సమస్యలు రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు.
పార్కిన్సన్స్ ఉన్నవారు ఎలాంటి వ్యాయామం చేస్తే బెస్ట్?
ప్రతిరోజూ వ్యాయామం చేయటం చాలా రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా పార్కిన్సన్స్ ఉన్నవారికి పవర్ వాకింగ్, స్విమ్మింగ్, వాటర్ ఏరోబిక్స్ వంటివి చాలా మార్పు తెస్తాయి. ఈ వ్యాయామాలు శక్తిని పెంచటమే కాకుండా మంచి నిద్రకు ఉపకరిస్తాయి. అంతేకాకుండా, మూడ్, బ్రెయిన్ ఫంక్షన్ ను ఇంప్రూవ్ చేస్తాయి.
రెగ్యూలర్ గా ఎక్సర్సైజ్ చేసేవారు, మామూలు వారి కంటే నాలుగైదు సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారని చాలా పరిశోధనలు ఇప్పటికే నిరూపించాయి. వ్యాయామం మొబిలిటీ, కండరాల్లో శక్తిని పెంచి తద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ సాధ్యపరుస్తుంది. ఏ వ్యాధులు లేనివారు కూడా కనీసం వారానికి మూడుసార్లు తమకు సరిపడే వ్యాయామాన్ని ఎంచుకొని చేస్తుంటే వయసు పెరిగినా కూడా ఆరోగ్యంగా బతకవచ్చు. మరి మీరు వర్కౌట్స్ ఎప్పుడు మొదలుపెడుతున్నారూ!?