Health Insurance Top-Up: 40 ఏళ్ల వయస్సులో ఈ పని చేయగలిగితే బెటర్- ఆసుపత్రిపాలైనా డబ్బులకు టెన్షన్ ఉండదు!
40ల్లో వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఈ అనిశ్చితి కోసం ముందుగా ప్లాన్ చేయకపోతే, అప్పటి వరకు దాచిన పొదుపు, పెట్టిన పెట్టుబడులు హరించుకు పోతాయి.
Health Insurance Top-Up: ఆరోగ్యమే మహా సంపద. ఎవరికైనా 40 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఈ సామెత సంపూర్ణ అర్ధం బోధపడుతుంది. ఆరోగ్యం ఎంత అవసరమో వాస్తవంగా తెలుస్తోంది. 20 ఏళ్లు లేదా 30 ఏళ్ళతో పోలిస్తే తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం 40 ఏళ్లలోనే ఎక్కువ. 30 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు కొండను కూడా పిండి చేయగల సత్తువ ఉంటుంది. 40 ఏళ్లు వచ్చే సరికి ఒక బండను కూడా ఎత్తలేం. ఒక ముద్ద ఎక్కువ తిన్నా అరిగి చావదు. తక్కువ తింటే నీరసం.
40ల్లో వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఈ అనిశ్చితి కోసం ముందుగా ప్లాన్ చేయకపోతే, అప్పటి వరకు దాచిన పొదుపు, పెట్టిన పెట్టుబడులు హరించుకు పోతాయి. కాబట్టి, మీకు కేవలం ఆరోగ్య బీమా మాత్రమే సరిపోదు, అవసరానికి తగిన సంపూర్ణ ఆరోగ్య బీమా కవరేజ్ చాలా అవసరం.
వయసు మీరే కొద్దీ కట్టాల్సిన ఆరోగ్య బీమా ప్రీమియం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి గురించి ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టే కండిషన్లు పెరుగుతాయి. దీనికి గొప్ప పరిష్కారం.. మీరు లేదా మీ కంపెనీ అందించే ఆరోగ్య బీమాను టాప్-అప్ చేయడం.
హెల్త్ ఇన్సూరెన్స్ టాప్-అప్ అంటే ఏమిటి?
ఆరోగ్య బీమా టాప్-అప్ ప్లాన్ అంటే.. ప్రస్తుత బీమా ప్లాన్ మీద కొనుగోలు చేసే అదనపు కవరేజీ. ఒకవేళ ఆరోగ్య బీమాను మీరు వాడుకున్నప్పుడు వైద్య ఖర్చులు కవరేజ్ పరిమితిని దాటితే, ఆపైన అయిన ఖర్చు మొత్తాన్ని మీరే చెల్లించాలి. మీరు అంతకముందే టాప్-అప్ చేసుకుని ఉంటే, బీమా కంపెనీయే ఆ వ్యత్యాసాన్ని కూడా భరిస్తుంది. కాబట్టి, మీ జేబులోంచి డబ్బు తీసే పరిస్థితిని నివారించడానికి హెల్త్ టాప్-అప్ ప్లాన్ ఒక మంచి పరిష్కారం.
ఎక్కువ ప్రీమియం చెల్లించే పెద్ద మొత్తానికి ఆరోగ్య పాలసీలు తీసుకునే బదులు, తక్కువ మొత్తం చెల్లించి హెల్త్ టాప్-అప్ తీసుకోవడం కూడా ఒక బెస్ట్ ప్లాన్. మెడికల్ బిల్లులు మీ కవరేజీని దాటితే, ఆపై మొత్తం టాప్-అప్ ప్లాన్ పరిధిలోకి వస్తుంది.
ఉదాహరణకు... రూ. 20 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే, అతని వైద్యానికి రూ. 30 లక్షలు ఖర్చయిందనుకుందాం. బేస్ ప్లాన్ కవరేజీ రూ. 20 లక్షలే కాబట్టి, ఆపై అయిన రూ. 10 లక్షలను అతను సొంతంగా చెల్లించాలి. దీని కోసం ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, లేదా అప్పులు చేయాలి. లేదా, వేరే అవసరాలకు దాచిన డబ్బును బయటకు తీయాలి. అతను మరో రూ. 20 లక్షల కవరేజీకి టాప్-అప్ తీసుకుని ఉంటే, అదనంగా అయిన రూ. 10 లక్షల మెడికల్ బిల్లు టాప్-అప్ ప్లాన్ పరిధిలోకి వెళ్తుంది. ఆ వ్యక్తి ఒక్క రూపాయి కూడా సొంతంగా కట్టాల్సిన అవసరం ఉండదు. ఆస్తులు అమ్ముకోవడం, అప్పులు చేయడం, పొదుపును ఖర్చు చేయడం లాంటి అవాంఛనీయ పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చు.
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి కూడా టాప్-అప్ తీసుకోవచ్చా?
మీరు మీ బేస్ పాలసీని కొనుగోలు చేసిన అదే బీమా సంస్థ నుంచి హెల్త్ టాప్-అప్ ప్లాన్ తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాన్‌ని మీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ లేదా వ్యక్తిగత ఆరోగ్య ప్లాన్‌తోనూ కలపవచ్చు.
ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం విషయంలో, ఆసియా ఖండంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. గత సంవత్సరంలో, మన దేశంలో ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం 14%గా ఉంది.
గత రెండు సంవత్సరాల్లో, హెల్త్ ప్రీమియంలు 10-25% పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య పాలసీని కొనుగోలు చేయడం లేదా రెన్యువల్ చేయడం, ముఖ్యంగా గ్రూప్ హెల్త్ పాలసీలు చాలా ఖరీదైనవిగా మారాయి. హెల్త్ టాప్-అప్ కొనుగోలు చేయడం వల్ల, ఈ ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణ సమస్యకు తక్కువ ధరకే పరిష్కారం లభిస్తుంది.