(Source: ECI/ABP News/ABP Majha)
Weather Updates: రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల వరకు వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి కాస్త బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ ఒడిశాలలో ఝర్సుగుడాకి పశ్చిమ వాయువ్య దిశగా 80 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వాయుగుండం కారణంగా రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో మూడు రోజులు..
వాయుగుండం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక ఇవాళ (సెప్టెంబర్ 15), రేపు ఉత్తర కోస్తాంధ్రాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రాలో కూడా రానున్న మూడు రోజులపాటు ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల బుధ (నేడు), గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలోనూ భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రం భీం, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇవాళ (సెప్టెంబర్ 15న) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని తెలిపింది. ఇది ఉత్తర కోస్తా ఒడిశా వద్ద చాంద్‌బలీకి పశ్చిమ వాయవ్య దిశగా 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది.
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అదికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ర్టాల్లో వైరల్ జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్నాయి. ఇప్పటికే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య అధికమైంది.