Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు- బయటకు రావొద్దని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక
Telangana Weather News: తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నిప్పులు కొలిమిని తలపించేలా భానుడి తీవ్రత ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Weather Latest News: తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నిప్పులు కొలిమిని తలపించేలా భానుడి తీవ్రత ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మే రెండు, మూడు వారాల నుంచి నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మొదటి వారం నుంచే నమోదవుతున్నాయి. అనేక చోట్ల వడగాడ్పులు, కొన్ని చోట్ల తీవ్ర వాడగాడ్పులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. సాధారణంగా కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.
రాయలసీమ, ఉత్తర కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, వైఎస్‌ఆర్, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తాలోని ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. శుక్రవారం నంద్యాల జిల్లా అలమూరులో అత్యధికంగా 44.4 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలోని లద్దగిరిలో 44.2, వైఎస్‌ఆర్ జిల్లాలోని మద్దూరు, పల్నాడు జిల్లాలోని గురజాలలో 44.1 డిగ్రీలు, ప్రకాశం జిల్లాలోని తిప్పాయ పాలెంలో 44, శ్రీకాకుళం జిల్లాలోని జి సిగడాంలో 43.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో 43.7, చిత్తూరు జిల్లాలోని నిండ్రలో 43.6, విజయనగరం జిల్లాలోన గుర్లలో 43.5, అన్నమయ్య జిల్లాలోని పెదమాండ్యంలో 43.4, తిరుపతి జిల్లాలోని ఎం నెల్లూరులో అత్యధికంగా 43, పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో 42.6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తీవ్రం కానున్న ఎండలు
రానున్న రెండు రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ, వాతావారణశాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శుక్రవారం ఏపీలోని 94 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 159 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శనివారం 179 మండలాల్లో తీవ్ర వాడగాడ్పులు, 208 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 193 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
నిప్పులు కుంపటిగా తెలంగాణ
గడిచిన మూడు రోజులు నుంచి ఎండ తీవ్రతతో తెలంగాణ నిప్పులు కుంపటిగా మారింది. శుక్రవారం నలుగు జిల్లాల్లో ఏకంగా 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో తొమ్మిది జిల్లాల్లో 43.4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ రంగ హెచ్చరికలనను వాతావరణశాఖ జారీ చేసింది. వీటల్లో 40 నుంచి 45 డిగ్రీలు మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ఖమ్మం జిల్లా తీవ్రమైన వేడితో మండుతోంది. సాధారణం కంటే అఽత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్నాయి. శుక్రవారం 36.7 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, 41.6 డిగ్రీలు నమోదైంది. రామగుండంలో సాధారణం కంటే 3.2 డిగ్రీలు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, భద్రాచలంలో 2.7 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జనగామ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది.
బయటకు రావద్దు
ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో వడగాడ్పులు హెచ్చరికలు ఉన్నాయని, కాబట్టి మధ్యాహ్నం 12 గంటలు నుంచి మూడు గంటలు మధ్య బయటకు రావద్దని సూచించింది. ఎండ తీవ్రత నేపథ్యంలో దాహం వేసినా, వేయకపోయినా వీలైనంత వరకు ఎక్కువ నీటిని తీసుకోవాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తాగాలి. ఇంట్లో తయారు చేసిన మజ్జిగ, నిమ్మరసం, లస్సీ, పండ్ల రసాలు తాగాలి. ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లాలి. పుచ్చకాయ, మస్క్ మెలోన్, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర, ఇతర స్థానికంగా లభించే పండ్లను, కూరగాయలను తీసుకోవాలి. సన్నని వదులుగా ఉండే వస్ర్తాలను ధరించాలి. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటివి ధరించాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాల్లో ఉండాలి. పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలి. శిశువులు, చిన్న పిల్లలు, ఆరు బయట పని చేసే వ్యక్తులు, గర్భిణీలు, మానసిక అనారోగ్యంతో బాధపడే వ్యకక్తులు, శారీర అనారోగ్యంతో ఉండే రోగులు, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆల్కహాల్, టీ, కాఫీ, బయటి శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోకూడదు. పాచిపోయిన ఆహారం జోలికి వెళ్లవద్దు. పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులను వదిలివేయవదద్దు. ప్రమాద సంకేతాలు ఉంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రాల నుంచి వైద్య సహాయం పొందాలి. గందరగోళం, చిరాకు, ఆందోళన, అటాక్సి, మూర్చ, కోమా వంటి పరిస్థితులు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
తెలంగాణకు చల్లని కబురు
ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో మూడు రోజలపాటు ఉరుముల, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం అసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలతో వానడలు పడతాయని ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల్లో తూర్పు మధ్య ప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.