BJP vs Congress: ఏ నిర్ణయమైనా మేం పార్టీని అడుగుతాం, వాళ్లు ఆ కుటుంబాన్ని అడుగుతారు - కాంగ్రెస్‌పై జేపీ నడ్డా విమర్శలు
BJP vs Congress: కాంగ్రెస్‌పై భాజపా నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా విమర్శలు చేశారు.
JP Nadda on Congress:
కాంగ్రెస్‌పై నడ్డా విమర్శలు..
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఓ టీవీ ఛానల్‌లోని చర్చలో పాల్గొన్న నడ్డా...కాంగ్రెస్ కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు కూడా "ఆ కుటుంబం" కనుసన్నల్లోనే నడుచు కోవాలని అన్నారు. పరోక్షంగా గాంధీ కుటుంబంపై ఇలా విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేకు అభినందనలు తెలిపిన నడ్డా...గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి ప్రెసిడెంట్ అవడాన్ని ప్రస్తావించారు. "గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అధ్యక్షుడైనా సరే...అధిష్ఠానం రిమోట్ కంట్రోల్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిందే" అని అన్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా యూపీఏ దేశాన్ని పదేళ్ల పాటు ఎలా పరిపాలించిందో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. భాజపా జాతీయ అధ్యక్షుడైనా సరే జేపీ నడ్డా అధిష్ఠానాన్ని అడగకుండా ఏ నిర్ణయమూ స్వతంత్రంగా తీసుకోలేడు అన్న కాంగ్రెస్ విమర్శలపైనా స్పందించారు. "మేము పార్టీలోని వాళ్లను అడుగుతాం. వాళ్లు కేవలం ఓ కుటుంబాన్ని అడుగుతారు. ఇదే మా రెండు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం" అని ఘాటుగా బదులిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల గురించీ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న సీట్లను కాపాడుకునేందుకే కింద మీద పడుతోందని అన్నారు. "ఆ పార్టీలో ఏ సమస్యలున్నాయో నాకు తెలుసు. కానీ వాళ్ల బలహీనతలను ఇప్పుడు నేను బయటపెట్టలేను. అవి చెబితే వాళ్లు ఇప్పటికిప్పుడు వాటి నుంచి బయట పడే అవకాశముంది. ఇవాళ వాటి గురించి మాట్లాడను. డిసెంబర్ 8న ఫలితాలు వచ్చాకే మాట్లాడతాను" అని వివరించారు జేపీ నడ్డా. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
నవంబర్ 12 న ఎన్నికలు..
హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తేదీని ఈ మధ్యే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతకు ముందే ఎన్నికల హడావుడి మొదలు కాగా... ఇప్పుడది ఇంకాస్త పెరిగింది. పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకుంటున్నాయి. అధికార భాజపా ఈ విషయంలో ముందంజలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో 62 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. సీఎం జైరామ్ ఠాకూర్మండి జిల్లాలోని సెరాజ్ (Seraj) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది. 2017లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను 44 చోట్ల భాజపా గెలిచింది. దీంతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కేవలం 21 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని గెలుచుకోగా,
ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో జై రామ్ ఠాకూర్‌ను పార్టీ అధిష్ఠానం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించింది.
Also Read: Telangana ప్రభుత్వం సంచలన నిర్ణయం, సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఉపసంహరణ