Indrakeeladri Dasara Festival : బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు, ఈ ఏడాది పది రోజుల పాటు!
Indrakeeladri Dasara Festival : బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు పది రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.
Indrakeeladri Dasara Festival : బెజవాడ ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు రెడీ అవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు అమ్మవారి అలంకారాలకు సంబంధించి అధికారులు చర్చించారు. అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు సూచించారు. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు ఆలయ అధికారులతో సమవేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుండే కాక తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారన్నారు. ప్రతి రోజు 30 వేల మందికి పైగా అమ్మవారి దర్శనానికి వస్తారని, మూలా నక్షత్రం రోజు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. పూర్వ అనుభావాలను దృష్టిలో ఉంచుకుని దసరా ఉత్సవాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు సూచనలు చేశారు.
ఆన్ లైన్ లో టికెట్లు
ముఖ్యంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు జారీ చేయడం, క్యూ లైన్ల ఏర్పాటు, విద్యుత్ దీపాల అలంకరణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు ఉచిత అన్నదానం, ప్రసాదంతోపాటు అవసరమైన ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటుచేయాలన్నారు. దసరా ఉత్సవాలలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు అమ్మవారిని దర్శించుకునేందుకు మార్గదర్శకాలపై ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. కొండపైన దిగువున సూచక బోర్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ , మున్సిపల్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక , ఇరిగేషన్, మత్స్య ,ఆర్అండ్ బీ, పీడబ్ల్యూడీ సమాచార పౌర సంబంధాలు తదితర శాఖ అధికారుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. త్వరలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఎగ్జిక్యూటర్ ఆఫీసర్ దర్బముళ్ళ భ్రమరాంబ, అధికారులు పాల్గొన్నారు.
గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని
దసరా ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా దసరా నాడు అమ్మవారిని దర్శించుకోవాలని ఆశపడుతుంటారు. ఈ ఏడాది పది రోజుల పాటు దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తిధుల్లో వచ్చిన హెచ్చుతగ్గులు కారణంగా ఈ సారి పది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయని ఆలయ వైదిక కమిటీ వెల్లడించింది. దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై వివాదాలు పరిపాటిగా మారాయి. ఈ సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 2020లో మూలా నక్షత్రం నాడు కొండ చరియలు దొర్లిపడ్డాయి. మరికాసేపట్లో అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించేందుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అధికారులు నానా హైరానా పడ్డారు. దీంతో ఇప్పటికే ఘాట్ రోడ్ ను మూసివేసి కొండరాళ్లు దొర్లిపడకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.