North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
Assam News: అసోంలో EVMని తీసుకెళ్తున్న కార్ ఉన్నట్టుండి నదిలో మునిగిపోయిన ఘటన సంచలనమైంది.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల మొదటి విడత(Lok Sabha Elections 2024 Phase 1 Voting) పోలింగ్‌లో పలు చోట్ల సమస్యలు తలెత్తాయి. మణిపూర్‌లో పలు పోలింగ్‌బూత్‌లపై దుండగులు దాడి చేశారు. ఫలితంగా 5 చోట్ల కాసేపు ఓటింగ్‌కి అంతరాయం కలిగింది. ఇక అసోంలోనూ అనూహ్య ఘటన జరిగింది. EVMలను తీసుకెళ్తున్న కార్ నదిలో మునిగిపోయింది. ఉన్నట్టుండి నదీలో నీటి మట్టం పెరగడం వల్ల ఒక్కసారిగా SUV వాహనం మునిగిపోయింది. ఓ మెకనైజ్డ్ బోట్‌లో ఈ కార్ ఉంది. హఠాత్తుగా నీటి ఉద్ధృతి పెరగడం వల్ల ఆ పడవ మునిగిపోయింది. దాంతో పాటు ఆ కార్ కూడా నీటిలో మునిగింది. లఖింపూర్ నియోజకవర్గంలో జరిగిందీ ఘటన. కార్ డ్రైవర్, పోలింగ్ ఆఫీసర్ కూడా నీటిలో మునిగిపోయారు. కానీ కార్ ఎలాగోలా తప్పించుకుని బయటకు వచ్చారు. EVM లో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల దాన్ని మార్చేయాలని అధికారులు భావించారు. ఈ ఈవీఎమ్‌ని తీసుకొస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అక్కడి సిబ్బంది వెంటనే స్పందించి కార్‌లోని ఈవీఎమ్‌ని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు.
"దియోపని నదిలో ఓ మెకనైజ్డ్ బోట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి నీటి ప్రవాహం పెరిగింది. ఫలితంగా పడవ మునిగిపోయింది. దాంతో పాటు కార్ కూడా నీటిలో మునిగిపోయింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిస్టమ్ వెంటనే అప్రమత్తమైంది. కార్‌ని నీళ్లలో నుంచి బయటకు తీసింది. రీప్లేస్ చేయాలనుకున్న ఈవీఎమ్ ఈ ప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది"
- అధికారులు