Uttarakhand BJP leader: ముస్లింతో బీజేపీ నేత కూతురి పెళ్లి, హిందూ సంఘాల నిరసనలతో రద్దు
Uttarakhand BJP leader: బీజేపీ నేత తన కూతురిని ముస్లింకి ఇచ్చి పెళ్లి చేయడంపై హిందూ సంఘాలు నిరసనలు చేపట్టడం వల్ల పెళ్లి రద్దైంది.
Uttarakhand BJP leader:
పెళ్లి రద్దు
ఉత్తరాఖండ్ బీజేపీ నేత పౌరీ మున్సిపల్ ఛైర్మన్ యష్‌పాల్ బెనం తన కూతురికి ముస్లిం యువకుడితో పెళ్లి చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇది లవ్ జీహాద్ అంటూ కొన్ని హిందూ సంఘాలు మండి పడ్డాయి. విమర్శలు మరీ ఎక్కువవడం వల్ల ఏం చేయాలో తెలియక మొత్తానికి పెళ్లే రద్దు చేసుకున్నారు. మే 28వ తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా క్యాన్సిల్ చేసుకున్నట్టు PTI వెల్లడించింది. ముస్లింతో పెళ్లేంటని చాలా మంది ఆయనను నిలదీశారు. ఇలాంటి పెళ్లిళ్లను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సోషల్ మీడియాలో ఈ వెడ్డింగ్ కార్డ్ వైరల్ అయింది. ఫలితంగా...అందరూ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ మొత్తం వివాదంపై యశ్‌పాల్ స్పందించారు. తన కూతురి ఆనందం కోసమే వివాహం నిశ్చయం చేసుకున్నామని చెప్పారు. కానీ అందరూ విమర్శించడం వల్ల వెనక్కి తగ్గుతున్నట్టు తెలిపారు.
"నా కూతురు ఆనందం కోసమే ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను. అంతా నిశ్చయమైపోయింది. కానీ..సోషల్ మీడియాలో అందరూ నాపై విమర్శలు చేశారు. కొందరు పెళ్లి ఆపేయాలని బెదిరించారు. అందుకే నేను ఈ పెళ్లిని రద్దు చేసుకున్నాను. ప్రజల అభిప్రాయాలనూ గౌరవించాలిగా. మే 28వ తేదీ పౌరీలో ఈ పెళ్లి జరగాల్సి ఉంది"
- యశ్‌పాల్ బెనం, ఉత్తరాఖండ్ బీజేపీ నేత
రెండ్రోజుల క్రితం హిందుత్వ సంఘాలు యశ్‌పాల్ దిష్టిబొమ్మల్ని తగలబెట్టాయి. ఇలాంటి పెళ్లిళ్లను ఒప్పుకోం అంటూ ఆందోళనలు చేపట్టాయి. ఈ ఒత్తిడి కారణంగానే...ఆయన పెళ్లి రద్దు చేసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే అయిన యశ్‌పాల్...బీజేపీ పరువు తీస్తున్నారంటూ కొందరు మండి పడ్డారు. ఇంకొందరైతే "ఈ రెండు నాల్కల ధోరణి ఎందుకు" అని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా లవ్ జీహాదే అని తేల్చి చెబుతున్నారు. కేరళ స్టోరీ సినిమాతో పోల్చారు. ఫేస్‌బుక్‌లో దీనిపై పెద్ద డిబేట్ జరుగుతోంది. "బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేరళ స్టోరీ సినిమాపై ట్యాక్స్ ఎత్తేస్తున్నాయి. కానీ...ఇక్కడ మాత్రం ఓ బీజేపీ నేత కూతురు ముస్లింని పెళ్లాడుతోంది. ఇలాంటి రెండు నాల్కల ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఓ ఫేస్‌బుక్ యూజర్ కామెంట్ చేశాడు. అయితే...దీనిపై పౌరి టెంపుల్ కమిటీ స్పందించింది.
"ఇది కచ్చితంగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం. హిందూ మతానికి చెందిన అమ్మాయిలను వేరే మతానికి చెందిన అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేయడాన్నీ ప్రచారంగా ఫీల్ అయిపోతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మత మార్పిడి చట్టాల్లో మార్పులొస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో మినార్ కట్టడాలను కూల్చి వేస్తున్నారు. కానీ...కొందరు బీజేపీ నేతలు మాత్రం..ఇంకా ముస్లింలకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్‌తో పాటు బజ్‌రంగ్ దళ్ దీనిపై కచ్చితంగా వ్యతిరేకత వ్యక్తం చేయాలి. బీజేపీ పార్టీ ఉన్నదే హిందువులను రక్షించుకోడానికి. ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పని చేసే వాళ్లను వెంటనే పార్టీ నుంచి తొలగించాలి"
- ఆలయ కమిటీ
Also Read: రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్ అవసరం లేదు, SBI కీలక ప్రకటన