US Indians : అమెరికాలో ఉద్యోగం పోతే 60 రోజులే గడువు - లేఆఫ్‌లతో విలవిల్లాడిపోతున్న ఇండియన్స్ - వెనక్కి రాక తప్పదా ?
US tech layoffs : అమెరికా టెక్ రంగంలో తీసివేతలు ఎక్కువగా భారతీయుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. పైగా ఉద్యోగం పోతే అరవై రోజుల్లో కొత్త ఉద్యోగం తెచ్చుకోలేకపోతే దేశం దాటిపోవాల్సిందేనని కొత్త రూల్ తెచ్చారు.
US tech layoffs hit Indian workers hard amid new visa rules : అమెరికాలో ఉద్యోగం ఇప్పుడు భారత యువతకు పీడకలగా మారుతోంది. మాంద్యం ముసురుకుంటున్న వేళ అక్కడి టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మాంద్యం కారణమో.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విజృంభణో కానీ ఎవరి ఉద్యోగాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే అమెరికాలో దిగ్గజ ఐటీ కంపెనీలు కనీసం లక్షన్నర మందిని ఉద్యోగం నుంచి తీసేసేశాయి. వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. ఈ ప్రభావం ఆయా కుటుంబాలపై ఎక్కువగా పడుతోంది.
ఉద్యోగాల్లేవు - పైగా తీసివేతలు
అమెరికాలోని యూనివర్శిటీల్లో చదువుకునేందుకు వెళ్లే భారతీయులు లక్షల్లో ఉంటారు. అక్కడకు వెళ్లి చదువుకుని మళ్లీ తిరిగి రావాలని ఒక్కరికీ కూడా ఉండదు. అక్కడే చదువు అయిపోయే లోపు ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడిపోవాలనుకుంటారు. నిన్నామొన్నటిదాకా ఒక్క సారి అమెరికాకు వెళ్తే.. అది సులువైన మార్గమే.. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు కొత్త ఉద్యోగాల సృష్టి తక్కువగా ఉండగా.. లే ఆఫ్‌లు మాత్రం పెరిగిపోతున్నాయి. అలా ఉద్యోగాలు పోతున్న వారిలో భారతీయుల వాటా అధికమే. కొత్తగా వెళ్లే వారికి ఉద్యోగాలు రాకపోగా.. పాత ఉద్యోగుల పరిస్థితి క్లిష్టంగా మారుతోంది.
ఉద్యోగం పోతే 60 రోజులే గడవు
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి H1B వీసాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే.. ఎంత కాలం నుంచి అమెరికాలో ఉంటున్నప్పటికీ .. గ్రీన్ కార్డు వస్తేనే.. ఉద్యోగం ఉన్నా లేకపోయినా అమెరికాలో ఉండవచ్చు. మరి ఎలాంటి వీసా ఉన్నా..దానికో కాలపరిమితి ఉంటుంది. H1B వీసా ఉన్నవారికి ఉద్యోగం ఉన్నంత కాలం ఎలాంటి సమస్యా రాదు. కానీ ఉద్యోగం పోతే మాత్రం అరవై రోజుల్లో దేశం విడిచిపోవాలి. ఈ లోపు మరో ఉద్యోగం తెచ్చుకుంటే కొనసాగవచ్చు. లేకపోతే మాత్రం.. వెళ్లిపోవాల్సిందే్. ఇటీవలే అరవై రోజులకు కుదిస్తూ మార్పులు చేశారు. ఉద్యోగాల కోత కారణంగా ..ఉద్యోగం కోల్పోయిన వారు అరవై రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోకపోతే ఇండియాకు వచ్చేయాల్సి ఉంటుంది.
H1B వీసాలు ఉన్న వారికి టెన్షన్
విద్య, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన వారు అక్కడే స్థిరిపడిపోవాలనుకుంటారు. అందుకే.. నిబంధనల ప్రకారం అర్హత రాగానే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్ట్ 190 ఏళ్ల వరకూ ఉంది. అమెరికా ఎంత మందికి గ్రీన్ కార్డులివ్వాలన్న దానిపై కఠినమైన నిబంధనలు పెట్టుకుంటుంది. అమెరికాలో ఇరవై ఏళ్లు ఉన్నారని వారికి గ్రీన్ కార్డు ఇచ్చేయాలనుకోదు. అర్హత ప్రకారం దరఖాస్తు చేసుకుంటే.. వరుస పద్దతిలో గ్రీన్ కార్డు లభిస్తుంది. భారతీయులు పెరిగిపోవడంతో ఇలాంటి అవకాశాలు పొందడం అసాధ్యంగా మారుతోంది. అందుకే H1b మీదనే అమెరికాలో ఉండాలి.
మా బిడ్డలు అమెరికాలో ఉన్నారని ఇక్కడ తల్లిదండ్రులు, కుటంబసభ్యులు కూడా హాయిగా ఉండలేని పరిస్థితి. అటు అమెరికాలో ఉండి.. ఉద్యోగం విషయంలో ఒత్తిడికి గురయ్యే పరిస్థితిలో యువత పడిపోయారు.