H-4 వీసాపై అమెరికా సంచలన నిర్ణయం.. భారత్, చైనాలకు భారీ లబ్ధి!
H-4 వీసాకు సంబంధించి ఉన్న సంక్లిష్టతలను తగ్గిస్తూ.. బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ వీసా ఉన్నప్పటికీ.. అమెరికాలో కొన్ని పద్దతులు పాటించాలి. వీటిని సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
H-4 Visa: అగ్రరాజ్యం(America)లో కీలకమైన అధ్యక్ష ఎన్నికలకు ముందు.. ఆ దేశ అధ్యక్షుడు.. జో బైడెన్(Joe Biden) సంచలన నిర్ణయా లు తీసుకుంటున్నారు. గతంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కాదని పక్కన పెట్టిన వాటికి కూడా.. ప్రజాప్రయోజనం ఉందని భావిస్తే.. జో బైడెన్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతోంది. ఇటీవలే హెచ్-1బీ వీసాల విషయంలో నిబంధనలను మారుస్తూ. మరింత సరళం.. అదేసమయంలో కఠినం కూడా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో వృత్తి నిపుణులకు కొరత ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అమెరికాకు చైనా(china), భారత్(India)ల నుంచి పెద్ద సంఖ్యలో వృత్తినిపుణులు వెళ్తుంటారు. వీరే అక్కడ మెజారిటీ సంస్థల్లో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇటీవల హెచ్1-బీ(H-1B) వీసాల్లో మార్పులు తీసుకువచ్చి.. మెజారిటీ ప్రయోజనాలు అందించింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు.. భారత, చైనా సంతతి పౌరులను ఆకర్షించే వ్యూహం ఉందనే వాదన ఉంది. ఇప్పుడు ఇదే పరంపరలో.. H-4 వీసాకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న సంక్లిష్టతలను తగ్గిస్తూ.. బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ వీసా ఉన్నప్పటికీ.. అమెరికాలో పనిచేయాలంటే.. కొన్ని నిబందనలు, పద్దతులు పాటించాలి. వీటిని సరళతరం చేస్తూ.. బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
అసలేంటీ H-4 వీసా
అమెరికాలో హెచ్-1బీ వీసాదారులు కోకొల్లలుగా ఉన్నారు. అయితే.. వీరిపై ఆధారపడిన వారు.. లేదా భాగస్వామి వంటివారిని అమెరికా తీసుకువెళ్లేందుకు.. H-4 వీసా తీసుకుంటారు. ఇలా హెచ్-1బీ వీసాలు ఉన్నవారు.. తమ వారిని తీసుకువెళ్లేందుకు వినియోగించేదే హెచ్-4. అయితే.. వీరు అమెరికా వెళ్లి అక్కడ చేతులు ముడుచుకుని కూర్చోకుండా.. ఏదైనా చిన్నపాటి పనులు చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఇలా పనిచేసుకోవాలంటే.. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ), ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తై.. ఆథరైజేషన్ వస్తే తప్ప హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీల్లేదు. ఈఏడీ రావడానికి కనీసం ఆర్నెల్ల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
హెచ్-4 వీసాదారులు.. అమెరికాలో పనులు చేసేందుకు అవసరమైన ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డా క్యుమెంట్(EAD), ఐ-765 ల మంజూరు తేలిక కానుంది. ఈ ఇబ్బందులను దూరం చేస్తూ ఆటోమేటిక్‌గా ఈఏడీ లభించేలా బైడెన్ ప్రభుత్వం నూతన బిల్లును తీసుకువచ్చింది. ఈ కీలక బిల్లు ‘జాతీయ భద్రత ఒప్పందం’ అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టారు. రిపబ్లికన్లు(Republicans), డెమోక్రాట్ల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఈ బిల్లు ఆమోదానికి ఇరువర్గాలు అంగీకరించాయి. దీంతో ఈ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని తెలుస్తోంది.
ప్రయోజనాలు ఇవీ..
+ తాజాగా తీసుకువచ్చిన బిల్లు వల్ల సుమారు లక్ష మందికి తక్షణ లబ్ధి చేకూరుతుంది.
+ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ), ఐ-765లు ఆటోమేటిక్‌గా మంజూరవుతాయి.
+ ఈఏడీ రావడానికి పట్టే ఆర్నెల్ల నిరీక్షణ తొలగిపోనుంది.
+ ఈ బిల్లు ఆమోదం పొందితే ఏటా 18 వేల మందికి ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డులు జారీ అవుతాయి.
+ ఇప్పటికే ఉన్న దరఖాస్తులతో కలిపితే.. ఐదేళ్లలో 1.58 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.
+ పర్యాటకం, వైద్యం, వ్యాపారం వంటి తాత్కాలిక పనుల నిమిత్తం అమెరికాకు వచ్చేవారికి జారీచేసే వలసేతర వీసా (ఐ1, ఐ2, ఐ3) ఉన్న వారిలో ఏడాదికి 25వేల మందికి తాజా బిల్లుతో ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
+ కొత్తగా తీసుకొస్తున్న బిల్లు వలసదారుల భాగస్వాములు, పిల్లలకు అవకాశాలను మెరుగుపరుస్తుంది.
+ 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా(Obama) కూడా ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. దాంతో శాస్త్రసాంకేతిక రంగాల్లో నైపుణ్యం ఉన్న భారతీయులకు కొంతఊరట కలిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఈ నిర్ణయంపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు హెచ్-4 వీసాదారులకు అవకాశాలు కల్పించేందుకు బైడెన్ సర్కారు సిద్ధమైంది. రాజకీయంగా కూడా ఈ నిర్ణయం కలిసి వస్తుందని అంటున్నారు. త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బారతీయ సంతతి పౌరుల ఓట్లు బైడెన్‌కు మేలు చేసు అవకాశం ఉందని అంటారు.