అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమే - చైనాకి కౌంటర్ ఇచ్చిన అమెరికా
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌ని భారత భూభాగంగానే గుర్తిస్తున్నట్టు అమెరికా కీలక ప్రకటన చేసింది.
Arunachal Pradesh Territory: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దే అని అమెరికా కీలక ప్రకటన చేసింది. ఆ రాష్ట్రాన్ని భారత్‌లో భాగంగానే గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. LAC వెంబడి చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించింది. సరిహద్దు విషయంలో చైనా ఆక్రమణలకు పాల్పడడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. అప్పటి నుంచి చైనా అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. గత వారమే చైనా రక్షణ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జంగ్ జియాగంగ్ మోదీ పర్యటనపై మండి పడ్డారు. జిజాంగ్ (టిబెట్‌కి చైనా పెట్టుకున్న పేరు) దక్షిణ భూభాగమంతా చైనాలో అంతర్భాగమే అని తేల్చి చెప్పింది. అక్కడే అరుణాచల్ ప్రదేశ్ ఉంది. భారత్ అక్రమంగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసిదంటూ మండి పడింది. మోదీ పర్యటించడాన్నీ తప్పుబట్టింది. చైనా ఇలా కొర్రీలు పెట్టడం కొత్తేమీ కాదు. గతంలో భారత్ నేతలు ఎవరు ఆ ప్రాంతానికి వెళ్లినా ఇలాగే స్పందించింది. అంతే కాదు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి జంగ్నన్ (Zangnan) అనే సొంతగా పేరు పెట్టుకుంది. ఇదంతా తమ భూభాగమే అని వాదిస్తోంది. మార్చి 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. 13 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన Sela Tunnel ని ప్రారంభించారు. తవాంగ్‌కి సమీపంలో ఉన్న ఈ టన్నెల్ భారత్‌కి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. పైగా చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు బలగాలను సరిహద్దు ప్రాంతానికి తరలించడం కష్టమైపోతోంది. ఇప్పుడీ సొరంగ నిర్మాణంతో ఆ పని సులువు కానుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
"అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమే అని అమెరికా గుర్తిస్తోంది. సరిహద్దు ప్రాంతంలో ఆక్రమణలకు పాల్పడేందుకు చేసే ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. LAC వెంబడి కవ్వింపు చర్యల్నీ వ్యతిరేకిస్తున్నాం"
- వేదాంత్ పటేల్, స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి
ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్, చైనా మధ్య చాలా సందర్భాల్లో వాగ్వాదం జరిగింది. ఈ ప్రాంతం తమదే అన్న చైనా వాదనల్ని భారత్ ఖండిస్తోంది. పేర్లు మార్చినంత సులువుగా నిజాల్ని మార్చలేరంటూ తేల్చి చెప్పింది. భారత విదేశాంగ శాఖ కూడా చైనా రక్షణ శాఖకి వార్నింగ్ ఇచ్చింది. అనవసరంగా కవ్వింపు వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికైనా భారత్‌లో అంతర్భాగమే అని వెల్లడించింది.