US on Modi Putin Call: మరోసారి ప్రధాని మోడీని ప్రశంసించిన అమెరికా,పుతిన్‌తో మాట్లాడటంపై కితాబు
US on Modi Putin Call: ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేయాలని పుతిన్‌తో మోడీ మాట్లాడటాన్ని అమెరికా స్వాగతించింది.
US on Modi Putin Call:
మోడీ చొరవను స్వాగతిస్తున్నాం: అమెరికా
ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేసి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని మోడీ సూచించారు. ఇటీవలే పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోడీ...ఈ సూచన చేశారు. దీనిపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్ విషయంలో భారత్ స్టాండ్‌ను ప్రశంసించింది. మోడీ పుతిన్‌తో కాల్ చేసి మాట్లాడటాన్ని స్వాగతించింది. అమెరికాకు చెందిన ప్రతినిధి పటేల్ భారత్‌ను కొనియాడారు.
"ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. ఉక్రెయిన్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నాం. మిగతా దేశాలు రష్యా విషయంలో ఏ వైపు ఉంటాయన్నది ఆయా ప్రభుత్వాల ఇష్టం. కానీ మేం మాత్రం మిత్ర దేశాలతో కలిసి యుద్ధాన్ని వీలైనంత త్వరగా ఆపేలా ప్రయత్నిస్తాం" అని స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో భారత్ పాత్ర ఏంటి..? అన్న ప్రశ్నకూ పటేల్ సమాధానమిచ్చారు. "ఈ యుద్ధాన్ని నిలువరించాలని కోరుకుంటున్న ప్రతి దేశమూ...ఉక్రెయిన్‌కు అండగా నిలబడాలి" అని వెల్లడించారు. ఇప్పటికే...ఉక్రెయిన్‌పై జరుగుతున్న రష్యా సైనిక చర్యపై భారత్ పలు సందర్భాల్లో స్పందించింది. అయితే...రష్యా మిత్ర దేశం కావడం వల్ల ఆచితూచి మాట్లాడుతూ వస్తోంది.
పుతిన్‌తో మాట్లాడిన మోడీ..
ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దౌత్యం, సంధి ద్వారానే ఉక్రెయిన్‌తో ఉన్న సమస్యల్ని పరిష్కరించు కోవాలని సూచించారు. "రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని..ప్రధాని మోడీ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సయోధ్య కుదుర్చు కోవాలని సూచించారు" అని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. నిజానికి..ప్రధాని మోడీ, పుతిన్ ముఖాముఖి భేటీ కావాల్సి ఉంది. కానీ...అది రద్దైంది. ఇందుకు కారణం...పుతిన్ పదేపదే అణు హెచ్చరికలు చేయడమే. ఈ విషయంలో భారత్ కాస్త అసహనానికి లోనైందని, అందుకే ప్రధాని మోడీ పుతిన్‌ను నేరుగా కలిసేందుకు సుముఖత చూపలేదని సమాచారం. అయితే...మరికొందరు మాత్రం ఆ మీటింగ్ రద్దు కావడానికి అది కారణం కాదని, అనివార్య కారణాల వల్ల రద్దు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. గతేడాది పుతిన్ ఢిల్లీకి వచ్చారు. భారత్, రష్యా సదస్సులో భాగంగా ఆయన హాజరయ్యారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే సదస్సు ఇది. ఈ ఏడాది ఎస్‌సీఓ
సమ్మిట్‌లో ప్రధాని మోడీ, పుతిన్ నేరుగా కలిశారు. ఆ సమయంలోనే మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇది యుద్ధం చేసుకోవాల్సి రోజులు కావు. ఏదైనా కలిసి కూర్చుని మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది" అని సూచించారు.
ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పీఎం మోదీని ప్రశంసించారు. "ఇది యుద్ధాలు చేయాల్సిన సమయం కాదని భారత ప్రధాని మోదీ చెప్పిన విషయం అక్షరాలా నిజం" అని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో వెల్లడించారు. న్యూయార్క్‌లో జరిగిన 77వ సెషన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు మేక్రాన్. "పీఎం మోదీ చెప్పింది నిజం. పశ్చిమ దేశాలపై ఈ యుద్ధం ద్వారా పగ తీర్చుకోవాలనుకోవడం సరికాదు. ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాల్సిన సమయమిది. అందరం కలిసికట్టుగా సమస్యల్ని ఎదుర్కోవాలి" అని అన్నారు.