US travel ban: ఈ 39 దేశాల నుంచి అమెరికాకు ఎవరూ వెళ్లలేరు - కొత్త ఏడాదిలో బ్యాన్ చేసిన ట్రంప్
Travel ban: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని దేశాల నుంచి తమ దేశానికి ఎవరూ రాకుండా బ్యాన్ చేశారు. మొత్తం 39 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

US announces travel ban on 39 countries from January 1 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2026 జనవరి 1వ తేదీ నుండి అమలులోకి వచ్చేలా మొత్తం 39 దేశాలపై** ప్రయాణ నిషేధాన్ని విధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.
అమెరికా జాతీయ భద్రతను కాపాడటం , ఉగ్రవాద ముప్పులను అడ్డుకోవడమే లక్ష్యంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రయాణ ఆంక్షల జాబితాను భారీగా పెంచారు. 2025 జూన్‌లో 19 దేశాలపై ఉన్న ఆంక్షలను ఇప్పుడు 39కి విస్తరించారు. అక్రమ వలసలను అరికట్టడం, వీసా నిబంధనల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. జనవరి 1, 2026 ఉదయం 12:01 గంటల నుండి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ఈ ఉత్తర్వులను ప్రభుత్వం రెండు భాగాలుగా విభజించింది. 19 దేశాలపై పూర్తి నిషేధం ఉండగా, మరో 20 దేశాలపై పాక్షిక నిషేధం అమలు చేస్తున్నారు. పూర్తి నిషేధం ఉన్న దేశాల పౌరులు ఎటువంటి వీసాలపై అమెరికాలో అడుగుపెట్టలేరు. పాక్షిక నిషేధం ఉన్న దేశాల పౌరులకు ఇమ్మిగ్రెంట్ వీసాలు, పర్యాటక (B-1/B-2), విద్యార్థి (F, M, J) వీసాల జారీని నిలిపివేశారు.
పూర్తి నిషేధం (19 దేశాలు + పాలస్తీనా): ఆఫ్ఘనిస్థాన్, బుర్కినా ఫాసో, బర్మా (మయన్మార్), చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లావోస్, లిబియా, మాలి, నైజర్, సోమాలియా, సౌత్ సూడాన్, సూడాన్, సిరియా, యెమెన్, సియెర్రా లియోన్ , పాలస్తీనా అథారిటీ జారీ చేసిన డాక్యుమెంట్లు ఉన్నవారు.
పాక్షిక నిషేధం (20 దేశాలు): అంగోలా, ఆంటిగ్వా & బార్బుడా, బెనిన్, బురుండి, కోట్ డి ఐవరీ, క్యూబా, డొమినికా, గాబన్, గాంబియా, మలావి, మౌరిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోగో, టోంగా, తుర్క్మెనిస్తాన్, వెనిజులా, జాంబియా, జింబాబ్వే.
మినహాయింపులు ఎవరికంటే?
ఈ ఆంక్షలు కేవలం కొత్తగా వీసా పొందే వారికి మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటికే చెల్లుబాటు అయ్యే వీసాలు కలిగి ఉన్నవారికి, గ్రీన్ కార్డ్ హోల్డర్లకు (LPR), ప్రస్తుతం అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, , అత్యవసర మానవతా కారణాలతో వచ్చే వారికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి లభించే అవకాశం ఉంది.
Partial and full Travel bans and US immigration restrictions go into effect January 1st. pic.twitter.com/8rygrW9I6m
— Breaking X (@BreakingXAlerts) January 1, 2026
ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ఆఫ్రికా , మధ్యప్రాచ్య దేశాల నుండి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులపై ప్రభావం పడనుంది. 2026లో అమెరికా వేదికగా జరగనున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు క్వాలిఫై అయిన సెనెగల్, కోట్ డి ఐవరీ వంటి దేశాల అభిమానులకు కూడా ఇది ఇబ్బందిగా మారనుంది.




















