విద్యుత్ చోరీ చేసిన వ్యక్తికి 18 ఏళ్ల జైలు శిక్ష, సుప్రీం కోర్టు సీరియస్
Power Theft: విద్యుత్ చోరీ చేశాడన్న కారణంగా ఓ వ్యక్తికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
18-Year Jail For Power Theft:
యూపీలో ట్రయల్ కోర్ట్ తీర్పు..
యూపీలో ఓ వ్యక్తి విద్యుత్‌ను చోరీ చేశాడన్న కారణంగా...ట్రయల్ కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో అరెస్ట్ అయిన నిందితుడు ఇక్రామ్‌కు 2020లో శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. అతడిపై 9 FIRలు నమోదయ్యాయని, ఒక్కో FIRకి రెండేళ్ల చొప్పున మొత్తం 18 ఏళ్లు శిక్ష విధిస్తున్నట్టు గతంలో తీర్పునిచ్చింది. అప్పటి నుంచి మూడేళ్ల పాటు జైల్లోనే ఉన్నాడు నిందితుడు. అయితే దీనిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి తీర్పుల కారణంగా వ్యక్తుల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని వ్యాఖ్యానించింది. హైకోర్టు కూడా ఈ విషయాన్ని పరిశీలించాలని సూచించింది. అంతే కాదు. ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితుడి శిక్షను రద్దు చేసింది. ఇప్పటికే మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఇక్రామ్..సుప్రీం కోర్టు తీర్పుతో విడుదల కానున్నాడు. "వ్యక్తుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా, వారికి ఊరట కలిగించకుండా ఉంటే ఇక మనమెందుకున్నట్టు..?" అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. శిక్ష తగ్గించాలని పిటిషన్ పెట్టుకున్న నిందితుడికి వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాదినీ కోర్టు మందలించింది. "విద్యుత్ దొంగిలించిన నేరాన్ని హత్యానేరంతో సమానంగా చూడలేం"అని తేల్చి చెప్పింది. "అలాంటి పిటిషనర్ల వాదన వినేందుకే సుప్రీం కోర్టు ఉంది. అది చిన్న విషయమా, పెద్ద విషయమా అన్నది సంబంధం లేదు. ప్రతి రోజూ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. కేవలం విద్యుత్ చోరీ చేసినందుకు 18 ఏళ్లు ఓ వ్యక్తిని
జైల్లో పెట్టమంటారా..?" అని మండి పడ్డారు సీజేఐ చంద్రచూడ్. ఎలక్ట్రిసిటీ యాక్ట్ కింద చూస్తే...అలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కానీ...ఇందుకు భిన్నంగా ట్రయల్ కోర్ట్ తీర్పునివ్వడంపై సుప్రీం కోర్టు ఇలా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ శిక్షను తగ్గించింది.
యూట్యూబ్‌పై పిటిషన్..
యూట్యూబ్ వల్ల తాను పరీక్షల్లో ఫెయిల్ అయ్యానంటూ భారీ పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించిన యువకుడికి షాక్ తగిలింది. పరిహారం ఇప్పటించాలని కోరిన యువకుడి పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తమ సమయం వృథా చేశారంటూ ఆ పిటిషనర్‌కు జరిమానా విధించింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షలకు ప్రిపేరయ్యాడు. కానీ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఉద్యోగం సాధించడంలో విఫలమయ్యాడు. అయితే తన ఓటమికి యూట్యూబ్ ను సాకుగా చూపించే ప్రయత్నం చేశాడు. తాను ఎన్నో విషయాలు నేర్చుకుందామని యూట్యూబ్ చూస్తుంటే, మధ్యమధ్యలో అశ్లీల ప్రకటనలు, అసభ్యకరమైన ప్రకటనలు వచ్చాయని కోర్టును ఆశ్రయించాడు. వీటి కారణంగా తన సమయం వృథా అయిందని, తద్వారా పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించలేకపోయానని తన దావాలో తెలిపాడు. కనుక తనకు యూట్యూబ్ నుంచి రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలంటూ కోర్టుకెక్కాడు. సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓక లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించింది. విచారణకు సైతం నిరాకరించిన సుప్రీం ధర్మాసనం.. ఆ యువకుడికి చీవాట్లు పెట్టింది.
Also Read: 10 Years Of Nirbhaya Case: నిర్భయ ఘటనకు పదేళ్లు, మహిళా భద్రతలో ఏమైనా మార్పు వచ్చిందా?