UP Election 2022: దెబ్బ అదుర్స్ కదూ..! అఖిలేశ్ ప్లాన్‌కు అడ్డంగా దొరికిపోయిన యోగి.. ఇక కష్టమే!
రోజురోజుకు భాజపా నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. అసలు దీనికి కారణమేంటి? దీని వెనుక అఖిలేశ్ యాదవ్ వ్యూహమేంటి?
"విధి ఎవరిని ఊరికే వదలదు.. ఎవరిది వాళ్లకి ఇచ్చేస్తుంది.." ఇది ఓ సినిమాలో డైలాగ్.. కానీ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో పరిస్థితులకు ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటివరకు యూపీలో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు.. ఠక్కున భాజపా అనే సమాధానమే ఎక్కువ వచ్చేది. మరి ఇప్పుడు అడిగి చూడండి. అంత వెంటనే సమాధానం రాదు.
ఎందుకంటే రోజురోజుకు యూపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా మూడు రోజుల్లో 9 మంది ఎమ్మెల్యేలు భాజపా నుంచి బయటకి వచ్చారు. ఇందులో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. ఎవరు ఔనన్నా.. కాదన్నా కచ్చితంగా ఇది యోగి సర్కార్‌కు కోలుకోలేని దెబ్బే. పోని ఇక్కడితో అంతా అయిపోయిందా అంటే.. రానున్న రోజుల్లో మరో నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలు భాజపాకు షాకిస్తారని సమాచారం. మరి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తక్షణ కర్తవ్యమేంటి? అసలు ఈ మార్పునకు కారణమేంటి? అఖిలేశ్ యాదవ్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
వీరంతా వారే..
ప్రస్తుతం భాజపాకు రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య నుంచి ధరమ్ సింగ్ సైనీ వరకు అంతా ఒకప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో ఉన్న ఓబీసీ నేతలే. అయితే 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిని భాజపా తమ పార్టీలోకి చేర్చుకోవడంలో సఫలమైంది. వీరి ద్వారా బలమైన బీసీ, దళిత ఓటర్లను ఆకర్షించుకోగలిగింది. యాదవులు, ముస్లింల ఓటు బ్యాంకు బలంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీని ఢీ కొట్టాలంటే ఈ ఓటర్లు ముఖ్యమని భాజపా భావించింది. అనుకున్నట్లుగానే భాజపా ఆ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది.
మాస్టర్ స్ట్రోక్..
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీ, దళిత, వెనుకబడిన వర్గాలను యోగి సర్కార్ నిర్లక్ష్యం చేసిందనే భావన ఈ నేతల్లో బలంగా ఉంది. దీన్ని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ క్యాష్ చేసుకున్నారు. ఆనాడు ఏ ఓటు బ్యాంకుతో అయితే తమను ఓడించారో వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంలో సఫలమయ్యారు.
వరుసగా బలమైన ఓబీసీ నేతలను పార్టీలోకి చేర్చారు. ముఖ్యంగా స్వామి ప్రసాద్ మౌర్యను పార్టీలోకి వచ్చేలా చేయడం అఖిలేశ్ మాస్ట్రక్ స్ట్రోక్ అనే చెప్పాలి. దీంతో ఆనాడు బీఎస్పీ నుంచి భాజపాలోకి వెళ్లిన ఓబీసీ నేతలంతా నేడు ఎస్పీలోకి చేరుతున్నారు. ఈ పరిణామాలతో ఓటు బ్యాంకు లెక్కలు కూడా మారే అవకాశం ఉంది.
పిలిచినా రాలేదు..
అయితే రోజురోజుకు ఎమ్మెల్యేలు జారిపోవడం భాజపాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఫోన్ చేసి వీరిని ఆపే ప్రయత్నం చేసినా వీరు తిరస్కరించినట్లు సమాచారం. దీంతో అధిష్ఠానం కూడా ఆలోచనలో పడింది. బలమైన ఓబీసీ ఓటు బ్యాంకును కోల్పోతే మొదటికే మోసం వస్తుందని నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
అయితే మరోవైపు అఖిలేశ్ యాదవ్ మాత్రం.. ఎన్నికల సర్వే లెక్కలు ఎలా ఉన్నా.. విజయం మాత్రం సమాజ్‌వాదీ పార్టీదేనని బల్లగుద్ది చెబుతున్నారు. ఎన్నికల సమయంలో భాజపా ఉపయోగించే ఆపరేషన్ ఆకర్ష్ ను ఈసారి తిరిగి కమలనాథులపైనే సంధించారు అఖిలేశ్ యాదవ్. మరి రానున్న రోజుల్లో యూపీ రాజకీయాలు ఇంకెంత మారతాయో చూడాలి.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి