Aparna Yadav Joins BJP: అనుకున్నట్లే అయింది.. భాజపాలోకి ములాయం చిన్నకోడలు.. సమాజ్‌వాదీలో గుబులు!
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. చిన్న కోడలు అపర్ణా యాదవ్ భాజపాలో చేరారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. చిన్న కోడలు అపర్ణా యాదవ్ ఈరోజు భాజపాలో చేరారు. ఇప్పటివరకు భాజపా నుంచి పలువురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరగా తాజా పరిణామంతో సమాజ్‌వాదీ శిబిరంలో గుబులు మొదలైంది.
దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్.. అపర్ణా యాదవ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పోటీకి సై..
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణను బరిలోకి దింపనున్నట్లు సమాచారం. అపర్ణ చేరికతో యాదవ సామాజిక వర్గం ఓట్లు తమకు వచ్చే అవకాశం ఉందని భాజపా భావిస్తోంది. ఆమె ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ములాయం సింగ్ రెండో భార్యకు పుట్టిన ప్రతీక్ యాదవ్ను అపర్ణ వివాహం చేసుకున్నారు. 2017 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. అపర్ణ భాజపాలో చేరుతారని ముందు నుంచీ ఊహాగానాలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఇప్పుడు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
వరుస చేరికలు..
ఇటీవల మూడు రోజుల్లో 9 మంది ఎమ్మెల్యేలు భాజపా నుంచి బయటకి వచ్చారు. ఇందులో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.
ప్రస్తుతం భాజపాకు రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య నుంచి ధరమ్ సింగ్ సైనీ వరకు అంతా ఒకప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో ఉన్న ఓబీసీ నేతలే. అయితే 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిని భాజపా తమ పార్టీలోకి చేర్చుకోవడంలో సఫలమైంది. వీరి ద్వారా బలమైన బీసీ, దళిత ఓటర్లను ఆకర్షించుకోగలిగింది. యాదవులు, ముస్లింల ఓటు బ్యాంకు బలంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి.. వీరి చేరికతో బీసీ ఓటు బ్యాంక్ కూడా దగ్గరవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
అందుకే అపర్ణా యాదవ్ చేరికతో సమాజ్‌వాదీ పార్టీ సంప్రదాయ ఓటర్లైన యాదువుల ఓట్లు కొల్లగొట్టాలని భాజపా మాస్టర్ ప్లాన్ వేసింది. మరి సమాజ్‌వాదీ పార్టీ ఏం చేస్తుందో చూడాలి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి