Modi-Zelensky Meet: హిరోషిమాలో జెలెన్‌స్కీ, ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ - ఏం చర్చించారు?
Modi-Zelensky Meet: జపాన్‌లో ప్రధాని మోదీ, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
PM Modi-Zelensky Meet:
జపాన్ పర్యటనలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ G-7 సమ్మిట్‌కు హాజరయ్యారు. జపాన్ ప్రధాని కిషిద ఆయనకు ఆహ్వానం పలికారు. జపాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలపైనే కాకుండా...అంతర్జాతీయ సమస్యల్నీ చర్చిస్తున్నారు. ముఖ్యంగా...పాక్, చైనాతో సరిహద్దు వివాదాలపై కీలక చర్చలు జరుగుతాయని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఇదే క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనా చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే...ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తరవాత ఇద్దరు నేతలు కలవడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఇరు దేశాల దౌత్యవేత్తలు ఈ సమావేశంపై సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. రెండు వర్గాల అధికారులు సుదీర్ఘ చర్చల తరవాత ఈ భేటీ జరిగింది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్‌స్కీని కూడా జపాన్ ప్రధాని కిషిద G-7 సదస్సుకి ఆహ్వానించారు. గత నెల ఉక్రెయిన్ డిప్యుటీ విదేశాంగ మంత్రి ఎమైన్ జపరోవా భారత్ పర్యటనకు వచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఏడాదిన్నర తరవాత ఉక్రెయిన్‌కి చెందిన ఓ లీడర్ భారత్‌కు రావడం అదే తొలిసారి. యుద్ధాన్ని ఆపడంలో సహకరించి "విశ్వగురు" అనిపించుకోవాలని అప్పట్లోనే ఆమె ప్రధానికి విన్నవించారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చారు ప్రధాని మోదీ. G-20 సదస్సులోనూ ఆయనతో మాట్లాడారు. ఈ విషయంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎటువైపూ నిలబడకుండా "శాంతినే కోరుకుంటున్నాం" అని చెబుతోంది.
PM @narendramodi held talks with President @ZelenskyyUa during the G-7 Summit in Hiroshima. pic.twitter.com/tEk3hWku7a
— PMO India (@PMOIndia) May 20, 2023
శాంతివైపే ఉంటాం: ప్రధాని
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించీ ఓ ఇంటర్వ్యూలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ స్టాండ్ ఏంటని ప్రశ్నించగా...ఆసక్తికర సమాధానమిచ్చారు. "భారత్ ఎప్పుడూ శాంతి వైపే నిలబడుతుంది" అని తేల్చి చెప్పారు. ఆ రెండు దేశాల యుద్ధం కారణంగా...కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని, వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటని వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్‌తో సమానంగా సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం కోసం ప్రధాని మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే లేఖ రాశారు. భారత పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా ఏప్రిల్ 11వ తేదీన విదేశాంగ మంత్రి మీనాక్షి లేఖికి ఈ లేఖ అందజేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు తన లేఖలో అదనపు మందులు, వైద్య పరికరాలను పంపడానికి సహాయం చేయాలని భారతదేశాన్ని అభ్యర్థించారు. తమ దేశంలో చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులను పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తున్నట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి చెప్పారు, ఇది వేల మంది భారతీయ విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. భారత్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా మాట్లాడుతూ రష్యాకు అండగా నిలవడమంటే చరిత్రకు రాంగ్ సైడ్‌లో ఉండటమేనని, తమ దేశం భారత్‌తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందని అన్నారు.
Also Read: PM Modi Japan Visit: హిరోషిమాలో జపాన్ ప్రధానిని కలిసిన నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ