Twitter - BBC: ట్విటర్‌పై మండి పడుతున్న BBC,ఆ లేబుల్ తీసేయాలని డిమాండ్
Twitter - BBC: గవర్నమెంట్ ఫండెడ్ మీడియాగా లేబుల్ చేయడంపై ట్విటర్‌పై బీబీసీ మండి పడుతోంది.
Twitter - BBC:
లేబుల్‌పై వివాదం
బీబీసీ, ట్విటర్ మధ్య వివాదం మొదలైంది. BBCని Government Funded Media గా లేబుల్ చేసింది ట్విటర్. దీనిపై బీబీసీ తీవ్రంగా మండి పడుతోంది. ట్విటర్ మేనేజ్‌మెంట్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఆ లేబుల్‌ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. బీబీసీ బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ. భారత్‌లోనూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నప్పటికీ...ఈ సంస్థకు బ్రిటన్ నుంచే భారీగా నిధులు వస్తాయి. క్రమంగా ఒక్కో దేశంలో న్యూస్ పోర్టల్స్‌ను ఓపెన్ చేసింది బీబీసీ. ట్విటర్‌లో ఈ కంపెనీకి చాలా అకౌంట్స్ ఉన్నాయి. ట్విటర్ సాధారణంగా ఇలాంటి సంస్థల్ని గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్‌గా డివైడ్ చేసి వాటికి ఓ లేబుల్ కేటాయిస్తుంది. 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న BBC Twitter Accountకి Government Funded Media అని లేబుల్ చేసింది. దీనిపైనే యుద్ధం మొదలైంది. ట్విటర్ చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తోంది. తమది ఇండిపెండెంట్ వార్తా సంస్థ అని వాదిస్తోంది. వెంటనే ఆ లేబుల్ తొలగించాలని తేల్చి చెబుతోంది.
"ఈ విషయమై ట్విటర్ అధికారులతో మేం మాట్లాడుతున్నాం. వీలైనంత త్వరగా పరిష్కరించాలనే చూస్తున్నాం. బీబీసీ ఎప్పుడూ స్వతంత్రంగానే పని చేసింది. ఇకపైన కూడా అంతే. బ్రిటీష్ ప్రజలు లైసెన్స్ ఫీజ్‌ల ద్వారా మాకు నిధులు అందిస్తున్నారు"
- బీబీసీ యాజమాన్యం
అటు ట్విటర్ కూడా బీబీసీ వ్యాఖ్యలపై స్పందించింది. ప్రభుత్వ సంస్థలుగా పని చేసే ప్రతి కంపెనీకి అదే లేబుల్ ఇస్తామని స్పష్టం చేసింది. లేదా ప్రభుత్వం నుంచి నిధులు అందినా...ఇదే లేబుల్ ఉంటుందని వెల్లడించింది.
"మీడియా సంస్థల ఎడిటోరియల్ కంటెంట్‌పై తప్పకుండా ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాల ఒత్తిడి కూడా ఉంటుంది. ఇలాంటి సంస్థలను గవర్నమెంట్ ఫండెడ్‌గానే వ్యవహరిస్తాం"
- ట్విటర్ యాజమాన్యం
ఈ భిన్న వాదనల మధ్య బీబీసీ డిమాండ్‌ని ట్విటర్ పట్టించుకుంటుందా..? అన్నది తేలడం లేదు. ప్రస్తుతానికైతే రెండు సంస్థల అధికారుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఐటీ దాడులు..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అంశం..బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులు. ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు కొనసాగిన ఈ సర్వేలో కొన్ని అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు అధికారులు. అయితే...దీనిపై BBC యాజమాన్యం అసహనం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ, ముంబయిల్లోని కార్యాలయాల్లో సర్వే చేసిన సమయంలో తమ జర్నలిస్ట్‌లను పని చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. సర్వే పూర్తైందని...ఇక రోజువారీ కార్యకలాపాలు కొనసాగించవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) వెల్లడించింది. కానీ...BBC మాత్రం ఆ అధికారులపై తీవ్రంగా మండి పడుతోంది. తమ ఉద్యోగులను గంటల కొద్ది పని చేయకుండా నిలువరించారని చెబుతోంది. అంతే కాదు. కొందరు అధికారులు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించింది. పోలీసులూ ఇదే విధంగా ప్రవర్తించారని స్పష్టం చేసింది. జర్నలిస్ట్‌ల ఫోన్లు లాక్కున్నారని, విచారణ పేరుతో రకరకాల ప్రశ్నలు వేసి వేధించారని మండి పడింది. అంతే కాదు. ఈ సర్వేకు సంబంధించిన వార్తలనూ రాయకుండా అడ్డుకున్నారని చెప్పింది BBC యాజమాన్యం. ఈ తీరుపై సీనియర్ ఎడిటర్లు ప్రశ్నించాక కానీ...పనులకు అనుమతించలేదని తెలిపింది. హిందీ, ఇంగ్లీష్ జర్నలిస్ట్‌లనూ ఇబ్బంది పెట్టారని ఆగ్రహంవ్యక్తం చేసింది. బీబీసీ ఆఫీస్‌లలో దాదాపు మూడు రోజుల పాటు దాడులు కొనసాగాయి. అయితే...ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ చేసిన కారణంగానే BBCపై ఇలా దాడులు చేయించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: Temple Accident: గుడిపై పడ్డ చింతచెట్టు, ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మృతి - 20 మందికి గాయాలు