TTD News: నందిని నెయ్యి సరఫరా నిలిపివేతపై రాజకీయ రగడ, అసలేం జరిగిందంటే?
TTD News: తిరుమల లడ్డూ తయారీలో ఇప్పటి వరకు వాడిని కర్ణాటక బ్రాండ్ నందిని నెయ్యిని టీటీడీ బోర్డు నిలిపివేసింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండగా.. కేఎంఎఫ్ పలు కీలక విషయాలను తెలిపింది.
TTD News: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్సో తిరుపతి లడ్డూ కూడా అంతే ఫేమస్. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ లడ్డూ కోసం ఇన్నాళ్లుగా కర్ణాటకలో తయారు చేసే నందిని బ్రాండ్ నెయ్యిని వాడేవారు. దాదాపు 25 వేల మంది రైతుల నుంచి సేకరించిన పాలతో తయారు చేసే అత్యుత్తమ ఆహార పదార్థం అయిన నెయ్యిని ధరల సమస్య కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు నెయ్యి సరఫరాను నిలిపి వేశారు. ఇదే విషయాన్ని కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్) అధ్యక్షుడు భీమా నాయక్ వెల్లడించారు. నందిని పాల ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో మరో కంపెనీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసుకుంటామని బోర్డు వెల్లడించినట్లు ఆయన బళ్లారిలో సోమవారం రోజు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున రాజకీయ రగడ మొదలైంది. గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చగా మారింది. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, విపక్ష నేతలు పోటాపోటీగా స్పందిస్తూ నెయ్యి విధానాన్ని మరింత జఠిలం చేశారు.
ఆవులు చనిపోవడం, చికిత్సకే ఎక్కువ ఖర్చు
ఏటేటా కనీసం 100 మెట్రిక్ టన్నుల నెయ్యిని తిరుపతికి ఇస్తున్న కేఎంఎఫ్ రాష్ట్ర రైతులకు అవసరమైన ధరలు ఇవ్వకపోవం, రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు నెయ్యిని పంపిణీ చేసేందుకు ఆసక్తి చూపలేదని పలు ప్రజా సంఘాలు, రైతు, హసిరు సేవ వంటి సంఘాలు కూడా ఆయా ప్రభుత్వాలను నిలదీశాయి. రాష్ట్రంలో గతేడాది పశువులకు సోకిన చర్మకుంటు వ్యాధి కారణంగా పాల ఉత్పత్తి విపరీతంగా తగ్గింది. రాష్ట్రంలో 16 జిల్లాల్లో పాల సంఘాలు కేఎంఎఫ్ లో సభ్యులుగా ఉన్నారు. వీటి ద్వారా సగటున రోజులు 99 లక్షల లీటర్ల పాలను సేకరించే కేఎంఎఫ్ గత ఏడాది కేవలం 60 లక్షల లీటర్ల పాలను మాత్రమే సేకరించింది. ఇందుకు కారణంగా చర్మవ్యాధులతో పశువులు చనిపోవడం, వాటి చికిత్సకు ఏడాది కేవలం 60 లక్షల లీటర్లనే సేకరించింది. అయితే చర్మ వ్యాధులతో పశువులు చనిపోవడం, వాటి చికిత్సలకు రైతులు ఎక్కువగా ఖర్చు చేయడంతో పాల ఉత్పాదన తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా పాలకు డిమాండ్ పెరిగింది.
లీటర్ పాలను కనీసం 5 రూపాయలకు పెంచితే రైతులకు లాభసాటిగా ఉంటుందని ప్రభుత్వానికి కేఎంఎఫ్ ప్రతిపాదించింది. గత ప్రభుత్వం కేవలం రూ.2 పెంచగా.. సిద్ధరామయ్య సర్కారు రూ.3 పెంచింది. పెరిగిన ధరలు, తగ్గిన ఉత్పాదనతో నందిని నెయ్యికి డిమాండ్ కూడా పెరిగింది. నందిని పాల ఉత్పత్తులకు తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, అసోం, మిజోరాం, సియాచిన్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రాష్ట్రంలో ఉత్పాదన తగ్గినా 40 శాతం మాత్రమే డిమాండ్ కు అనుగుణంగా విక్రయాలు జరుగుతుంటే.. మిగిలిన 60 శాతం రాయితీలతో విక్రయిస్తున్నారు. ఈ కారంగానే తక్కువ ధరలు ఆహ్వానించే టీటీడీ వంటి సంస్థలకు నెయ్యి అందించేందుకు కేఎంఎఫ్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం కిలో నెయ్యికి రూ.400 కు ఇస్తున్నాం: కేఎంఎఫ్ ఎండీ
ఆవు నెయ్యితో చేస్తూ వస్తున్న లడ్డూకు ప్రత్యేక రుచి వస్తుందని భక్తుల నమ్మకం. 50 సంవత్సరాలుగా కర్ణాటక నుంచి నెయ్యి వస్తుండగా.. కర్ణాటక పాల సమాఖ్య ప్రారంభమైన తర్వాత ఏటా నందిని బ్రాండ్ నెయ్యిని సరపరా చేసేందుకు టెండర్ దక్కించుకుంటూ వస్తోంది. టెండర్లకు ఆహ్వానం పలికినప్పుడు.. ప్రతీ ఒక్కరూ అందులో పాల్గొంటారని.. ఎవరు తక్కువ ధరను కోట్ చేస్తారో వాళ్లే టెండర్ ను గెలుచుకుంటారని కేఎంఎఫ్ ఎండీ జగదీష్ చెప్పారు. ప్రస్తుతం కిలోకు దాదాపు రూ.400 పలుకుతున్నామని... ఎవరైనా ఇంతకంటే తక్కువ ధర కోట్ చేసినప్పుడు.. టెండర్ ఆ బిడ్డర్‌కు వెళుతుందని వివరించారు. తమ సేకరణ ప్రకారం 400 రూపాయలకు పైగా కోట్ చేశామని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం నడిచే సంస్థ కేఎంఎఫ్ అని.. అందుకే తక్కువ ధరకు నెయ్యిని అందించడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. ఇలా చేస్తే సంస్థ నష్టాల పాలు కావాల్సి వస్తుందని పేర్కొన్నారు.