Trump Rally Shooting: ట్రంప్‌పై దాడి చేసింది ఈ యువకుడే, కీలక ప్రకటన చేసిన FBI
Trump Attacked: డొనాల్డ్ ట్రంప్‌ని చంపేయాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిపారని FBI ధ్రువీకరించింది. భద్రతా వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Trump Rally Shooting Updates: పెన్సిల్వేనియాలో ప్రసంగిస్తుండగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రంప్ గాయపడ్డారు. కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరు హతమయ్యారు. ట్రంప్ స్పీచ్ ఇస్తున్న వేదికకు ఎదురుగానే ఓ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నుంచే ఇద్దరూ కాల్పులు జరిపినట్టు తేలింది. చాలా దగ్గరి నుంచి ఈ దాడి చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే FBI కీలక ప్రకటన చేసింది. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిందని తేల్చి చెప్పింది. అయితే ఇంకా ఈ హత్యాయత్నం వెనక ఎవరున్నారన్నది ఇంకా తెలియలేదని, త్వరలోనే ఈ వివరాలు వెల్లడిస్తామని వెల్లడించింది.
ఎందుకు హత్య చేయాలనుకున్నారన్న కోణంలోనూ విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు తెలిశాకే దీనిపై మాట్లాడతామని తెలిపింది. నిందితుడిని గుర్తించేందుకు ప్రజల సాయమూ అవసరమేనని వివరించింది. ఏదైనా సమాచారం తెలిస్తే తమకు చెప్పాలని FBI విజ్ఞప్తి చేసింది. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ట్రంప్ మద్దతుదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. భద్రతా వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా ఎదురుగా ఉన్న బిల్డింగ్‌పైకి ఓ వ్యక్తి గన్ పట్టుకుని వెళ్లడం తాము చూశామని కొందరు స్థానికులు వెల్లడించారు.
సెక్యూరిటీని అప్రమత్తం చేసినప్పటికీ పట్టించుకోలేదని, అందుకే ఈ దాడి జరిగిందని ట్రంప్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కాల్పులు జరిపిన వాళ్లలో థామస్ అనే వ్యక్తిని గుర్తించారు పోలీసులు. మొదటి నుంచి రిపబ్లికన్‌లపై ద్వేషం పెంచుకున్నాడని, ట్రంప్ అన్నా పీకల్లోతు కోపం ఉందని వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే చంపేందుకు ప్రయత్నించారా..? లేదా ఇంకేదైనా కారణముందా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
BREAKING: Thomas Matthew Crooks ID'd as the suspect who shot at Donald Trump at his PA rally.
— Collin Rugg (@CollinRugg) July 14, 2024
Crooks was 20-years-old from Bethel Park, Pennsylvania which was about 40 miles south of the Butler rally.
An AR-15 was reportedly recovered at the scene.
Crooks was apparently shot… pic.twitter.com/D5GP6hVYWC
కాల్పులు జరిపిన వాళ్లలో ఓ అనుమానితుడి పేరుని థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలోనే హతమయ్యాడు. 20 ఏళ్ల థామస్ పెన్సిల్వేనియాకి 40 మైళ్ల దూరంలో ఉండే బెథెల్ పార్క్‌లో ఉంటున్నాడని అధికారులు వెల్లడించారు. AR-15 గన్‌ని స్వాధీనం చేసుకున్నారు. ట్రంప్‌ని హతమార్చేందుకు ప్రయత్నిస్తుండగా థామస్‌పై సెక్యూరిటీ కాల్పులు జరిపింది. బులెట్ నేరుగా తలలోకి దూసుకెళ్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరి కొద్దిరోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ దాడి జరగడం సంచలనమవుతోంది. భద్రతా వైఫల్యం అన్న ఆరోపణలు వస్తుండడం మరింత అలజడి రేపుతోంది. ట్రంప్ చెవి పక్క నుంచే బులెట్ దూసుకుపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. గాయంతో ఆయన బయటపడ్డారు.