Tirupati Laddu Row: తిరుమల లడ్డు కల్తీ ఉద్దేశ్యపూర్వక నేరమే! సంచలన వ్యాఖ్యలు చేసిన అవిముక్తేశ్వరానంద్ సరస్వతి
Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ ఘటన కోట్లాది మంది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడిగా అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఆరోపించారు. పూర్తిస్థాయి విచారణ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
![Tirupati Laddu Row: తిరుమల లడ్డు కల్తీ ఉద్దేశ్యపూర్వక నేరమే! సంచలన వ్యాఖ్యలు చేసిన అవిముక్తేశ్వరానంద్ సరస్వతి Tirupati Laddu controversy an attack on Hindu sentiments Avimukteshwaranand Saraswati serious comments Tirupati Laddu Row: తిరుమల లడ్డు కల్తీ ఉద్దేశ్యపూర్వక నేరమే! సంచలన వ్యాఖ్యలు చేసిన అవిముక్తేశ్వరానంద్ సరస్వతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/25/a37a34f57907feeecc64731aa0ed95d017272366075861097_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirupati Laddu Row : తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు కల్తీ అనేది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడిగా ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఆరోపించారు. ఈ కల్తీ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని అవిముక్తేశ్వరానంద్ సరస్వతి డిమాండ్ చేశారు.
ఉద్దేశ్యపూర్వక కుట్రతో కోట్లాది మంది హిందువుల మనోవేదన:
ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చేపట్టిన దేశ వ్యాప్త గురు రక్ష యాత్ర ప్రస్తుతం బిహార్‌లోని పాట్నాలో కొనసాగుతోంది. లడ్డు వివాదంపై స్పందించిన పీఠాధిపతి పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కోట్ల మంది హిందువుల విశ్వాసాలు దెబ్బతిన్నాయన్నారు. ఇది పూర్తిగా హిందూ విశ్వాసాలపై జరిగిన దాడిగా అవిముక్తేశ్వరానంద్ ఆరోపించారు. ఇదొక ఉద్దేశ్య పూర్వక కుట్రగా ఆయన అభివర్ణించారు. హిందూ సమాజం పట్ల జరిగిన అమానుష ఘటనగా చెప్పారు. దీన్ని కేవలం ఒక వివాదంగా మాత్రమే చూడకూడదన అంతకు మించిన విషయమని పీఠాధిపతి అభిప్రాయపడ్డారు. 1857లో ఒక మంగల్ పాండే పంది కొవ్వుతో ఉన్న కాట్రిడ్జ్‌ను నోటితో ఓపెన్ చేయని ఘటన దేశంలో ఓ పెను విప్లవాన్ని సృష్టించిందన్నారు. ఇప్పుడు మాత్రం అదే పదార్థాన్ని కోట్ల మంది హిందువుల నోళ్లలోకి పంపారని ఆయన దుయ్యబట్టారు.
ప్రధాని ఇంట్లో లేగదూడలతో ఆడుకుంటారు.. బయట మాత్రం గోమాంసం ఎగుమతులు జరుగుతుంటాయి:
దేశంలో గోహత్యలపై కూడా అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. గోహత్యపై దేశ వ్యాప్తంగా నిషేధం విధించేలా చట్టం రావాలని డిమాండ్ చేశారు. దేశంలో రోజురోజుకూ గోమాంసం ఎగుమతులు పెరిగి పోవడం బాధను కలిగిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఒకవైపు దేశ ప్రధాని ఆయన నివాసంలో లేగదూడలతో నెమళ్లతో ఆడుకుంటూ ఉంటారు. మరోవైపు గోమాంసం ఎగుమతులు కూడా స్వేచ్ఛగా జరిగి పోతుంటాయని అవిమక్తేశ్వరానంద్ విమర్శించారు. ఈ అంశంలో రాజకీయ నాయకుల నుంచి తమకు ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ లేవన్నారు. వాళ్లు హిందూ సమాజం ఉన్నతి గురించి ఎప్పుడూ ఆలోచించరని మండిపడ్డారు. రాజకీయ నాయకులు అందరూ రాజకీయ వ్యవస్థలోకి వెళ్లిన తర్వాత కేవలం సెక్యులర్‌గా మాత్రమే ఉంటామంటూ ప్రమాణాలు చేస్తుంటారన్నారు. హిందూ సమాజమే ఈ దిశగా చైతన్యవంతమై గోవులను కాపాడుకోవాల్సి ఉందన్నారు. క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్‌పై తనకు ఏ విధమైన వ్యతిరేకత లేదన్న ఆయన ఆ విషయం మాత్రం రాజకీయం చేయడం నచ్చలేదన్నారు. కులగణన చేపట్టి వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని తాము కూడా కోరుకుంటామని అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చెప్పారు.
సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో తిరుమల లడ్డూ కల్తీ గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. ఆ తర్వాత రోజే అందుకు సంబంధించిన ఆధారాలు తెలుగుదేశం పార్టీ బయటపెట్టగా రాజకీయ వివాదం మొదలైంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఐజీ స్థాయి అధికారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ కూడా వేసింది. సుప్రీం కోర్టులోనూ వైకాపా నేతలు ఈ ఘటనకు సంబంధించి పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆవు నెయ్యిని రాగితో, పంది కొవ్వు ఆయిల్‌ను బంగారంతో పోల్చుతూ వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)