IPCC Report Update: విశాఖ మునిగిపోనుందా? అదే జరిగితే ముప్పు తప్పదా?.. నాసా షాకింగ్ రిపోర్ట్!
విశాఖ నగరం కనుమరుగు కానుందా? రానున్న రోజుల్లో సముద్ర గర్భంలో కలిసిపోనుందా? దీనిపై నాసా అంచనాలు ఏం చెబుతున్నాయి?
ప్రకృతి అందాలతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకొనే నగరం విశాఖపట్నం. మరి, ఈ నగరంలో భవిష్యత్తులో కనుమరుగు కానుందా? కాలక్రమేనా సముద్ర గర్భంలో కలిసిపోనుందా? ఈ ప్రశ్నలకు పరిశోధకులు ఔననే అంటున్నారు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) అంచనాలు ఈ విషయన్నే స్పష్టం చేస్తున్నాయి. ఈ శతాబ్దం చివరికి దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లోని 12 నగరాలు నీటిలో కలిసిపోనున్నాయని, సముద్ర మట్టాలు సుమారు మూడు అడుగుల మేరకు పెరిగే అవకాశాలున్నాయని నాసా పేర్కొంది. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(IPCC) విడుదల చేసిన తాజా రిపోర్టులో ఈ విషయాలను వెల్లడించారు.
విశాఖపట్నంతోపాటు దేశంలోని ముఖ్య నగరాలైన ముంబయి, చెన్నై, కొచి సైతం ఈ ముప్పును ఎదుర్కొంటాయని తెలిపారు. ఇటీవల నాసా.. ప్రపంచంలోని సముద్ర మట్టాల పెరుగుదలపై అంచనాలను రూపొందించింది. వాతావరణ మార్పుల వల్ల ఇండియాలోని 12 నగరాల్లో సముద్ర మట్టాలు విపరీతంగా పెరగనున్నాయని తెలిపింది.
21వ శతాబ్దంలో సముద్ర మట్టాలు పెరగడం, తీర ప్రాంతాలకు కోతకు గురికావడం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం వంటివి చోటుచేసుకుంటాయని ఐపీసీసీ నివేదికలో పేర్కొన్నారు. ఒకప్పు్డు వందేళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటివి చోటుచేసుకొనేవని, శతాబ్దం చివరి నాటికి ఇలాంటివి ప్రతి సంవత్సరం చోటుచేసుకొనే అవకాశం ఉందని తెలిపారు.
వాతావరణ మార్పులు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, తేమ, పొడి వాతావరణం, గాలులు, మంచు తుఫాన్లు వంటివి చోటుచేసుకుంటాయని, సముద్ర తీర ప్రాంతాలు.. మహాసముద్రాల్లో సైతం ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. 2006 నుంచి 2018 మధ్యకాలంలో రూపొందించిన అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాల స్థాయి ఏడాదికి 3.7 మిల్లీమీటర్లు చొప్పున పెరుగుతున్నాయి.
హిందూ కుష్ హిమాలయన్ (HKH) ప్రాంతంలోని మంచు క్రమేనా కరిగిపోవడం కూడా సముద్రమట్టాలు పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రిపోర్టును రూపొందించినవారిలో బృందంలో ఒకరైన కృష్ణ అచ్యుతరావు తెలిపిన వివరాల ప్రకారం.. 21వ శతాబ్దం నాటికి HKH రీజియన్‌ను కప్పి ఉంచే మంచు క్రమేనా కరిగిపోతుంది. 1970 నుంచే హిమానీనదాలు పలుచబడుతున్నాయి. తిరోగమనానికి గురవ్వుతున్నాయి.
ఈ శతాబ్దం చివరి నాటికి ఏయే నగరాల్లో ఎంత స్థాయి నీటిమట్టాలు పెరుగుతాయో చూడండి:
⦿ కండ్ల: 1.87 అడుగులు
⦿ ఓఖా: 1.96 అడుగులు
⦿ భౌనగర్: 2.70 అడుగులు
⦿ ముంబై: 1.90 అడుగులు
⦿ మోర్ముగావ్: 2.06 అడుగులు
⦿ మంగళూరు: 1.87 అడుగులు
⦿ కొచ్చిన్: 2.32 అడుగులు
⦿ పారాదీప్: 1.93 అడుగులు
⦿ ఖిదీర్‌పూర్: 0.49 అడుగులు
⦿ విశాఖపట్నం: 1.77 అడుగులు
⦿ చెన్నై: 1.87 అడుగులు
⦿ ట్యూటికోరిన్: 1.9 అడుగులు