(Source: ECI/ABP News/ABP Majha)
Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు I.N.D.I.A - అధికారికంగా ప్రకటించిన ఖర్గే
ఎన్డీఏకి పోటీగా ఇండియా కూటమిగా ప్రతిపక్ష పార్టీలు బరిలోకి దిగనున్నాయి. ఈ పేరును రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తే పార్టీలన్నీ ఆమోదించాలని ఖర్గే ప్రకటించారు.
Bengaluru Opposition meet : బీజేపీని ఎదుర్కొనేందుకు ఏకమైన విపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరును ఖరారు చేశాయి. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా నిర్ణయించాయి. రాహుల్ గాంధీ ఈ పేరును ప్రతిపాదించారని.. ఈ పేరుపై నేతలంతా సుముఖత, ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పేరును ఖర్గే అధికారికంగా ప్రకటించారు. I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ (INDIA)గా నూతన కూటమికి పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది.
బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన విపక్ష కూటమి సమవేశాలు
బెంగళూరులో సోమ, మంగళవారాల్లో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు పాల్గొన్నాయి.
ప్రధాని పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదన్న ఖర్గే
ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి మక్కువ ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావని, ప్రజలను కాపాడటం కోసం వాటిని పక్కన పెట్టవచ్చునని చెప్పారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారన్నారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న యువత కోసం, హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం వాటిని వదిలిపెట్టవచ్చునని చెప్పారు.
బీజేపీకి భయం పట్టుకుందన్న విపక్ష కూటమి
ఈ సమావేశానికి హాజరైన 26 పార్టీలకు తగినంత రాజకీయ బలం ఉందని విపక్ష కూటమి నేతలు చెబుతున్నారు. 11 రాష్ట్రాల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు. కూటముల ప్రాధాన్యాన్ని వివరించారు. బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలను దక్కించుకుందని, ఈ స్థానాలను ఆ పార్టీ తనంతట తాను గెలుచుకోలేదని ఖర్గే ప్రకటించారు. బీజేపీ తన మిత్ర పక్షాల ఓట్లను పొంది, అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత ఆ మిత్ర పక్షాలను వదిలేసిందని చెప్పారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు రాష్ట్రాల్లో తిరుగుతూ, పాత మిత్రులతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారన్నాని ఎద్దేవా చేశారు.