Kashmir Terrorism: కశ్మీర్ లో ఉగ్రవాదానికి త్వరలోనే క్లైమాక్స్: రాజ్ నాథ్
కశ్మీర్ లో ఉగ్రవాదం త్వరలోనే అంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్ లో అస్థిర పరిస్థితులు సృష్టించాలని పాక్ చేసే యత్నాలు ఫలించవన్నారు.
భారత్ తో నేరుగా యుద్ధం చేసే సత్తా పాకిస్థాన్ కు లేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. జాతీయ భద్రత అంశంపై మాట్లాడిన రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1965, 1971 యుద్ధాలను ప్రస్తావిస్తూ.. భారత్ లో అస్థిర వాతావారణం సృష్టించాలని పాకిస్థాన్ ఎన్నో సార్లు ప్రయత్నించి ఘోరంగా విఫలమైందన్నారు. పాక్ కు భారత్ తో నేరుగా తలపడే శక్తి లేదన్నారు.
మేము 'ఒకసారి వేచి చూద్దాం' అనే ధోరణిలో ఉన్నాం. ఇందుకు కారణం ఇరు దేశాల మధ్య నమ్మకం లేకపోవడమే. కానీ ఇటీవల చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సరిహద్దుల్లో ఎలాంటి కాల్పుల ఘటన నమోదు కాలేదు.
లద్దాఖ్ సహా మరికొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయని రక్షణ మంత్రి అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించినా, స్థానిక పార్టీలు కాదన్నా ఆర్టికల్ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.
తగ్గిన ఉగ్రవాదం..
ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తీవ్రవాద చర్యలు 60 శాతం తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాళ్ల దాడులు 87 శాతం మేర తగ్గాయి. పర్యటక రంగం 20 నుంచి 25 శాతానికి తిరిగి పుంజుకుంది. అయితే అభివృద్ధి ఎలా ఉన్నా అక్కడి స్థానిక పార్టీలు మాత్రం దీనిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఆ పార్టీలన్నీ కలిసి పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ పేరుతో ఓ కూటమిగా ఏర్పడ్డాయి.