Terror Module Busted: 1993 నాటి ముంబయి పేలుళ్ల తరహా దాడికి పక్కా ప్లాన్!
దిల్లీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు.. 1993 నాటి ముంబయి పేలుళ్ల తరహా ప్లాన్ పన్నినట్లు దర్యాప్తులో తేలింది.
దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన ఉగ్రముఠా.. 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల తరహాలో దాడులకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీనితో పాటు మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను కూడా ఎంచుకున్నట్లు దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం వెల్లడించింది.
పక్కా ప్లాన్‌తో..
ఈ ఉగ్రవాదులకు రైల్వే ట్రాక్‌లు, బ్రిడ్జ్‌లు పేల్చడంలో శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తెలిసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. వీరంతా 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల తరహాలో దాడులకు ప్లాన్ చేసినట్లు విచారణలో తెలిసింది. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను ఎంచుకున్న ముష్కరులు అక్కడ రెక్కీ నిర్వహించేందుకు వెళ్లారు. రెక్కీ అనంతరం వీరంతా ఒక చోట చేరి ఆపరేషన్ చేపట్టాలని పథకం రచించినట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద సమూహాలను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
విచారణలో కొందరు స్లీపర్ సెల్స్ పేర్లను ఉగ్రవాదులు చెప్పినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి 1.5కిలోల ఆర్డీఎక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆరుగురు అరెస్ట్..
నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారంతో గత మంగళవారం మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన దిల్లీ ప్రత్యేక విభాగ పోలీసులు.. ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురిని, దిల్లీలో ఇద్దరిని, రాజస్థాన్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం.
1993 మార్చి 12న ముంబయి వ్యాప్తంగా 12 వరుస బాంబుపేలుళ్లు జరిగాయి. దావూద్ ఇబ్రహిం నేతృత్వంలో జరిగిన ఈ ఘటనలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
వీళ్లెవరంటే..?
భారత్‌లో పండుగలను లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు ఈ ముఠా కుట్రలు పన్నింది. వినాయక నిమజ్జనం సందర్భంగా పేలుళ్లు జరిపేందుకు ఈ ముఠా ప్రణాళికలు రచించినట్లు సమాచారం.