AP Letter To KRMB : కృష్ణా జలాల వాటాలపై వార్... కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ మరో లేఖ..!
కృష్ణా జలాల్లో సగం వాటా కావాలంటున్న తెలంగాణ వాదన సహేతుకం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలోలానే 70-30 శాతం కేటాయింపులు చేయాలని కృష్ణాబోర్డుకు లేఖ రాసింది.
కృష్ణా జలాల్లో వాటా కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా కృష్ణా బోర్డుకు లేఖలు రాస్తున్నాయి. కృష్ణా జలాల్లో తమకు 70 శాతం వాటా కేటాయించాల్సిందేనని తాజాగా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని ఆ ప్రకారమే ఇక ముందు కూడా కేటాయింపులు జరపాలని కోరింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల పైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని లేఖలో ఏపీ ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ ఏడాది నీటి కేటాయింపులు జరిపే వరకూ తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీని కోరింది. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనల్ని ఏర్పాటు చేసినట్టు లేఖలో ఏపీ ఈఎన్‌సీ వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం ఇలా లేఖ రాయడానికి కారణం .. కృష్ణా జలాల్లో సగం సగం వాటా కావాల్సిందేనని కొద్ది రోజుల కిందట తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖలు రాయడమే. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేనందున తాత్కాలికంగా ఈ వాటర్ ఇయర్‌లో.. 811 టీఎంసీల కృష్ణా జలాలను చెరి సగం పంచాలంటూ తెలంగాణ పట్టుబడుతోంది. అలా కేటాయించవద్దని ఏపీ సర్కార్ కోరుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీల కృష్ణా నీటిని గతంలో బచావత్ ట్రైబ్యునల్ కేటాయించింది. ప్రాజెక్టులవారీగా కేటాయింపులు జరగాలంటూ తెలంగాణ ప్రభుత్వం బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విభజన అనంతరం ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే నిష్పత్తితో జలాలను పంచుకోవడానికి అప్పట్లో రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. కానీ ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ప్రారంభమయ్యాయి. దీంతో కృష్ణా జలాలను చెరి సగం పంచాలని తెలంగాణ డిమాండ్ చేయడం ప్రారంభించింది.
మరో వైపు శ్రీశైలంలో అదే పనిగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూండటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ నీరు మొత్తాన్ని తెలంగాణ కోటాలో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. సెప్టెంబర్ ఒకటో తేదీన కృష్ణా బోర్డు సమావేశం జరగనుంది. 27నే జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. నీటిని చెరి సగం పంచాలన్న తెలంగాణ డిమాండ్‌ను కూడా కేఆర్‌ఎంబీ సమావేశ ఎజెండాలో చేర్చారు. అటు జలవిద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలపై చర్చించేందుకు కూడా ఎజెండాలో చేర్చారు. కృష్ణాబోర్డు సమావేశం ఈ సారి వాడి - వేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.