Botsa Controversy : బొత్సకు తెలంగాణ మంత్రుల ఘాటు కౌంటర్ - ఆన్సర్ ఇచ్చేకే హైదరాబాద్ రావాలని సవాల్ !
తెలంగాణ విద్యా వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్సకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తమకు సమాధానం ఇచ్చిన తర్వాతే హైదరాబాద్ రావాలన్నారు.
Botsa Controversy : తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదం అవుతున్నాయి. తెలంగాణ మంత్రులు బొత్స సత్యనారాయణ తీరుపై మండి పడుతున్నారు. ముందు తమ రాష్ట్రం సంగతి చూసుకోవాలని.. అక్కడ చేసిన నిర్వాకాలు చాలవా అనిప్రశ్నిస్తున్నారు.
రాజధాని లేని రాష్ట్రమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా
బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. ఏ రాష్ట్రం ఎంత అభివృద్ది చెందుతుందో ప్రజలకు తెలుసునని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బొత్స మాట్లాడినందుకు తాము కూడా మాట్లాడాల్సి వస్తుందని.. రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని విమర్శలు గుప్పించారు. రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితి అని అన్నారు. వారికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. నెలకొకసారైనా హైదరాబాద్‌కు రాకుంటే ఆయన ప్రాణం ఊరుకోదని అన్నారు. అలాంటిది హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలపై డౌట్ ఉందని డయల్ 100కు ఫోన్ వస్తే.. ఎంక్వైరీ చేసి.. పాతళంలోకి వెళ్లి లీకేజ్‌ను పట్టుకున్నామని చెప్పారు. స్కామ్‌తో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేశామని.. ఇందుకు అభినందించాల్సి ఉందన్నారు. ఆనాడూ నీళ్లు, నిధులలో అన్యాయం చేశారని.. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్పీలో దందాలు నడిపారని ఆరోపించారు. గతంలో ఏపీపీఎస్సీలో స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ వాళ్లను ఎన్నో రకాలుగా కించపరిచే విధంగా మాట్లాడరని అన్నారు. అలా జరగకుండే ఏపీ, తెలంగాణ కలిసే ఉండేయని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. బొత్స సత్యనారాయణ బాధ్యతయుతమైన వ్యక్తిగా మాట్లాడలేదని అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్ని ఆస్పత్రులు కట్టుకున్నారనేది అందరికి తెలుసునని అన్నారు. అక్కడివారికి అనారోగ్యం వస్తే చికిత్స కోసం ఎక్కడికి వస్తున్నారని ప్రశ్నించారు.
ఏపీకి ఒక్క అవార్డు కూడా రాలేదన్న గంగుల
విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. తెలంగాణ విద్యావ్యవస్థలో కేరళను మించిపోయిందని ప్రకటించారు. టీఎస్పీఎస్సీలో స్కామ్ ను బయటపెట్టిందని తమ ప్రభుత్వమేనన్న ఆయన తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు.ఏపీకి ఒక్కటైనా అవార్డు వచ్చిందా అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై బొత్స స్పందించాలన్నారు.స్పందించిన తరువాతే బొత్స హైదరాబాద్ లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంతో బాగుండాలని తాము కోరుకుంటున్నామన్నారు.తెలంగాణలో 1,009 గురుకులాలు ఉన్నాయన్న మంత్రి గంగుల ఏపీలో కేవలం 305 గురుకులాలే ఉన్నాయని తెలిపారు. బొత్స గతంలో కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తాము కించపరిచే విధంగా మాట్లాడాలంటే.. చాలా ఉన్నాయని చెప్పారు. విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదనే తాము మాట్లాడటం లేదని తెలిపారు. ఏపీ వాళ్లు బతకడానికి హైదరాబాద్‌కు వస్తే కడుపులో పెట్టుకుంటున్నామని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే బొత్స మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ విద్యా వ్యవస్థపై అసలు బొత్స ఏమన్నారంటే ?
తెలంగాణలో జరుగున్న ఇంజినీరింగ్ ప్రవేశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన బొత్స ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రవేశాలు పూర్తైన తర్వాత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తామన్నారు బొత్స సత్యనారాయణ... తెలంగాణలో పరీక్షలు నిర్వహణ కూడా సరిగా లేదన్నారు. తెలంగాణ అడ్మిషన్ల సంగతి రోజూ పేపర్లో చూస్తున్నామన్నారు. ఆఫ్ర్టాల్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే ఎలా జరిగాయో చూస్తున్నామంటూ విమర్సలు చేశారు. ఎంత చూచిరాతలు, ఎన్ని స్కామ్‌లు, ఎంతమంది అరెస్టు అయ్యారో తెలుస్తోందన్నారు. తెలంగాణలో ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలపై కూడా బొత్స కామెంట్స్ చేశారు. టీచర్స్ ట్రాన్సఫర్సే తెలంగాణ వాళ్లు చేసుకోలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అందుకే ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రాన్ని కంపేర్ చేయొద్దని మీడియాకు సూచించారు. ఎవరి విధానం వారికి ఉంటుందన్నారు. ఎవరి ఆలోచన వారిదన్నారు. ఎవరి లైన్ వాళ్లదని... ఎవరిపైనా కామెంట్స్ చేయడం లేదంటూనే సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.