Breaking News: దళిత బంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. హాజరైన కాంగ్రెస్ కీలక నేత భట్టి విక్రమార్క
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
దళిత బంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. హాజరైన భట్టి
దళితబంధు పథకం అమలుపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఓ సమీక్షా సమావేశం జరుగుతోంది. హుజూరాబాద్‌తో పాటు మరో 4 మండలాల్లో దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు హాజరయ్యారు.
వారంలో భక్తులందరికీ శ్రీవారి సర్వ దర్శన అవకాశం
మరో వారం రోజుల్లో శ్రీవారి భక్తులందరికీ ఆన్ లైన్ బుకింగ్ ద్వారా సర్వ దర్శనానికి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శనం టోకెన్‌లను ఆన్ లైన్‌లో విడుదల చేస్తామని అన్నారు. టోకెన్ల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు చెప్పారు. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే సమయంలో ఆ టోకన్లు అయిపోయాయని, భక్తులు ఆందోళనకు దిగడం, లాఠీచార్జి వంటి పరిణామాలు జరగడం బాధాకరమని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌కి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. బహ్రెయిన్‌లో ఓ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం వల్ల చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారిలో చాలా మంది ఏపీకి చెందిన వారు ఉన్నారన్నారని లేఖలో తెలిపారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని సీఎం జగన్ కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం తెలిపారు.
హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని అపోలో వైద్యులు సోమవారం మధ్యాహ్నం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని తెలిపారు. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిధరమ్ తేజ్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రగాయాలు అయ్యాయి.
నిమజ్జనం తీర్పు సవరించేందుకు హైకోర్టు నిరాకరణ
హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించేందుకు నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఇవాళ రివ్యూ పిటిషన్ వేశారు. ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.