Breaking News: అనంతపురం పట్టణంలో భారీ అగ్నిప్రమాదం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్‌డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
అనంతపురం పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనంతపురంలోని జేఎన్‌టీయూ సమీపంలో ఈ రోజు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న పవిత్ర హైపర్ మార్ట్ అగ్నిప్రమాదానికి గురయ్యింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాదంలో దాదాపుగా రూ. 70 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు చెబుతున్నారు. దాదాపుగా మూడు గంటల నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారని ఆత్మహత్యాయత్నం..
అధికార వైఎస్సార్‌సీపీ నేత వేధిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఏపీలోని అవుకు మండలం సింగనపల్లిలో చోటుచేసుకుంది. సింగనపల్లికి చెందిన ఆరవ జక్కన్న అనే వ్యక్తి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ముక్కమల్ల పుల్లారెడ్డి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని జక్కన్న లేఖ రాశాడు. సారాయి మట్కా పేరుతో పుల్లారెడ్డి.. తన ఇంటి మీదకు పోలీసులను పంపించి వేధిస్తున్నాడని లేఖలో తెలిపాడు. ప్రస్తుతం బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.
సున్నిపెంటలో కొండచిలువ హల్ చల్..
ఏపీలోని శ్రీశైలం మండలం సున్నిపెంటలో కొండ చిలువ హల్ చల్ చేసింది. స్థానిక రెడ్ల కళ్యాణ మండపం నుంచి రింగ్ పార్క్ వెళ్లే రోడ్డుపై కనిపించింది. దీనిని చూసిన స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండ చిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలివేశారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.