Telangana News: '15 లక్షల దరఖాస్తులు పరిశీలించొద్దు' - గృహలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం?
Gruhalaxmi Scheme: గత బీఆర్ఎస్ హయాంలో గృహలక్ష్మి పథకం కింద సేకరించిన దరఖాస్తులను పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మళ్లీ కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తోంది.
Telangana Government Decision on Gruhalaxmi Scheme: రాష్ట్రంలో గృహలక్ష్మి (Gruhalaxmi) పథకంపై ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాం చివరలో ప్రారంభించిన ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించింది. దాదాపు 15 లక్షల దరఖాస్తులు రాగా, వాటిని పూర్తిగా పక్కనపెట్టి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తుల ప్రక్రియ జరిగిందన్న ఆరోపణలతో కొత్తగా దరఖాస్తుల ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానుంది.
అప్పట్లో ఇలా
బీఆర్ఎస్ హయాంలో తొలుత డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది. భారీ యూనిట్ కాస్ట్ తో, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉచితంగా రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. అయితే, ధరలు సరిపోవడం లేదంటూ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం సైతం కొన్ని సాంకేేతిక లోపాలతో పీఎం ఆవాస్ యోజన పథకం నిధులు నిలిపేసింది. ఈ క్రమంలో సరిగ్గా ఏడాది క్రితం బీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్ రూం ఇళ్ల స్థానంలో ‘గృహలక్ష్మి’ పథకం ప్రారంభించింది.
ఎన్నికలతో బ్రేక్
సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు రూ.3 లక్షలు అందించేలా ఈ పథకం రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను నిర్మించేలా లక్ష్యంగా పెట్టుకుని ‘గృహలక్ష్మి’ని డిజైన్ చేశారు. దాదాపు 15 లక్షల దరఖాస్తులు రాగా, వాటిల్లో 12 లక్షల దరఖాస్తులను అర్హమైనవిగా తేల్చారు. సుమారు 4 లక్షల దరఖాస్తులు ఎంపిక చేసే వేళ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అధికారులు 2 లక్షల దరఖాస్తులకు సంబంధించి జాబితా సిద్ధం చేశారు. వారికి నిధులు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి కూడా వచ్చింది. అయితే, ఎన్నికలు దగ్గరపడడం, ప్రచారం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. కాగా, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పథకం కింద వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టాలని, తాజాగా మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది.
గ్రామ సభల ద్వారా
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామసభల ద్వారానే దరఖాస్తులు స్వీకరించేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత ప్రభుత్వం సేకరించిన దరఖాస్తులను పక్కన పెట్టి మళ్లీ కొత్తగా అప్లికేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా జరగాల్సి ఉంటుంది. గిరిజనేతరులకు అక్రమంగా పథకాల లబ్ధి కలగకుండా ఈ నిబంధన తెచ్చారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణలో నిబంధనలు పాటించలేదన్న వాదనను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సమాచారం.
Also Read: Telangana News: తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం - పలు డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన సర్కార్