Telangana News: తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం - డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన సర్కార్, సమ్మె విరమణపై అధికారిక ప్రకటన
Junior Doctors: తెలంగాణ ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం అయ్యాయి. ఈ క్రమంలో సమ్మెపై జూనియర్ వైద్యులు వెనక్కు తగ్గారు. వారి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
Junior Doctors Cessation of Strike in Telangana: తెలంగాణలో జూనియర్ వైద్యుల (Junior Doctors) సమ్మెకు బ్రేక్ పడింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో (Damodara Raja Narasimha) మంగళవారం జూడాల చర్చలు సఫలం కావడంతో జూడాలు వెనక్కు తగ్గారు. గతంలో 3 నెలలకోసారి ఇచ్చే స్టైఫండ్ ను ప్రతి నెలా 15 వరకూ ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో నూతన భవన నిర్మించాలన్న డిమాండ్ కు సైతం ఆయన సానుకూలంగా స్పందించారు. 2 నెలల్లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, దీంతో సమ్మె విరమించుకున్నట్లు జూనియర్ వైద్యుల సంఘం అధికారికంగా ప్రకటించింది. కాగా, గత 3 నెలలుగా తమకు స్టైఫండ్ ఇవ్వడం లేదని జూనియర్ డాక్టర్లు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు నిరవధిక సమ్మెకు ఉపక్రమిస్తున్నట్లు వైద్య విద్య డైరెక్టర్ కు నోటీసులిచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం జూడాలను చర్చలకు ఆహ్వానించింది. జూడాల డిమాండ్లకు మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించడంతో జూనియర్ వైద్యులు వెనక్కు తగ్గారు.
ప్రభుత్వ హామీలివే
స్టైఫండ్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు సహా ప్రతి నెలా 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ వారికి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి కొత్త సాఫ్ట్ వేర్ ను 20 రోజుల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు డీఎంఈ తెలిపారని జూడాలు పేర్కొన్నారు. డీఎన్ బీ విద్యార్థులకు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న స్టైఫండ్ త్వరలోనే విడుదల చేసేందుకు మంత్రి అంగీకరించారని వెల్లడించారు. ప్రైవేట్ కాలేజీల పీజీ, ఇంటర్న్ షిప్ విద్యార్థుల స్టైఫండ్ పై సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు జూడాలు తెలిపారు. అలాగే, జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం హాస్టల్స్ లో వసతులు కల్పించడం సహా కొత్త హాస్టల్స్ ఏర్పాటును పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మించేందుకు మంత్రి అంగీకరించారని, 2 నెలల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారని జూడాలు వెల్లడించారు. పీజీ, ఇంటర్న్ షిప్ వైద్య విద్యార్థుల పని వేళలకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని చర్చల్లో నిర్ణయించినట్లు జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు కౌశిక్, ఉపాధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ హామీల మేరకు సమ్మె విరమిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు.
Also Read: KTR Tweet: కేటీఆర్, సిద్ధరామయ్య మధ్య ట్వీట్ వార్- ఆరు గ్యారెంటీల అమలుపై మాటల యుద్ధం