(Source: ECI/ABP News/ABP Majha)
Telangana News: యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయ విచారణ - విద్యుత్ రంగంపై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
CM Revanth Reddy: తెలంగాణలో విద్యుత్ పై జ్యుడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశించారు.
CM Revanth Reddy Ordered Judicial Enqury on Yadadri Project: తెలంగాణలో (Telangana) విద్యుత్ రంగానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాదాద్రి ప్రాజెక్టుతో (Yadadri Project) పాటు ఛత్తీస్ గఢ్ (Chattishgarh) తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపైనా సీఎం రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు. విద్యుత్ రంగంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య శాసనసభలో వాడీ వేడీ చర్చ సందర్భంగా, తనపై వస్తోన్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సభాపతిని కోరారు. ఈ క్రమంలో సీఎం రేవంత్, జగదీష్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
'రూ.వేల కోట్ల అవినీతి'
భద్రాద్రి ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించి 8 ఏళ్లైనా పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. 'ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉంది. టెండర్లు లేకుండానే ఒప్పందం జరిగింది. ఆనాడు మేము దీనిపై పోరాడితే మార్షల్స్ తో సభ నుంచి బయటకు పంపారు. 1000 మెగా వాట్ల ఒప్పందం వల్ల ప్రభుత్వంపై రూ.1,362 కోట్ల భారం పడింది. ఆ ఒప్పందాల వెనుక ఉద్దేశాలు బయటకు రావాలి. భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారు. ఒప్పందాల వల్ల ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చారు. దీనిపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం.' అని రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
24 గంటల విద్యుత్ పై కమిటీ
బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ విషయంలో సాధించింది గుండుసున్నా అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వ్యవసాయ విద్యుత్ అనే ప్రజల సెంటిమెంట్ ఆధారంగా ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. 24 గంటల విద్యుత్ పై అఖిలపక్షంతో నిజ నిర్దారణ కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. అప్పట్లో ఛత్తీస్ గఢ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెబితే సదరు ఉద్యోగి హోదా తగ్గించి మారుమూల ప్రాంతాలకు పంపారని అన్నారు. 'ఆనాటి ప్రభుత్వం ఏనాడూ సభ ముందు వాస్తవాలు బయటపెట్టలేదు. మేము విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను ప్రజలు ముందుంచాం. మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ సవాల్ మేరకు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాం. అప్పుడు మంత్రులుగా ఉన్న వారిని చేరుస్తాం. విచారణలో మీ ఉద్దేశాలేంటో తేలుతాయి. ఇప్పటివరకూ కొత్త ప్రాజెక్టు కట్టలేదు. 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ అబద్ధాలు చెప్తున్నారు. సభలో దబాయిస్తూ ఇంకెంత కాలం గడుపుతారు.?' అంటూ సీఎం నిలదీశారు.
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు
అటు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దైంది. సీడబ్ల్యూసీ సమావేశం కోసం ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా ఆయన శాసనసభలో చర్చలోనే ఉండిపోయారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఫ్లైట్ మిస్ కావడంతో మరో విమానం కోసం సీఎంవో ప్రయత్నించింది. కాగా, ప్రస్తుత పరిణామాలతో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం, సభలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.