TDP News: రాష్ట్రాన్ని ఆ ఐదుగురికి రాసిచ్చావా జగన్? - అచ్చెన్నాయుడు
AP News: టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు.
TDP Jayaho BC in Mangalagiri: 2024 ఎన్నికల్లో 160 స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీనే అని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ వర్క్ షాప్ జరిగింది.
బీసీలు టీడీపీ వెంట ఉన్నారనే అక్కసుతో జగన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నారని.. బీసీలను రాజకీయంగా అణగతొక్కేందుకు రిజర్వేషన్లు 20 శాతానికి తగ్గించిన జగన్ రెడ్డి పెద్ద దగాకోరు అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. జగన్ రెడ్డి ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు నాలుక గీసుకోడానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్ల ద్వారా బడుగుల్లో ఒక్కరికైనా రుణం ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అచ్చెన్నాయుడు సవాలు విసిరారు.
‘‘మంత్రి చెల్లుబోయిన జగన్ చిన్నాన్న పాదాల దగ్గర కూర్చుని బలహీన వర్గాల పరువు తీశాడు. కోడిగుడ్డు అమర్నాథ్ కు టికెట్ కూడా ఇవ్వలేదు. రాష్ట్రం నలుదిక్కులనూ విజయసాయి, వేమిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, సజ్జలకు జగన్ రాసిచ్చాడు. జగన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తూ బడుగు, బలహీన వర్గాలను అణగతొక్కుతున్నాడు. సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపు, ఆదరణ పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డి బీసీ ద్రోహి.
జగన్ రెడ్డి అరాచక పాలనపై ప్రశ్నించినందుకు నన్ను 75 రోజులు జైల్లో పెట్టాడు. యనమల, అయ్యన్న సహా ఎందరో నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించిన జగన్ రెడ్డిని సాగనంపాల్సిందే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారందరికీ అవకాశాలు కల్పిస్తాం. జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తాం. ప్రతి పార్లమెంటు పరిధిలో జయహో బీసీ సభలు పెడతాం. చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.
బీసీలను ఆదుకున్న వ్యక్తి చంద్రబాబే - యనమల
పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ‘‘టీడీపీ పుట్టిందే బీసీల కోసం. ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందు బీసీల్లో సామాజిక, ఆర్దిక, రాజకీయ ఎదుగుదల లేదు. టీడీపీ ఏర్పడక ముందు బీసీలు పెత్తందారీ విధానానికి లోనయ్యేవారు. బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగితే పెత్తందారులకు రాజకీయ మనుగడ ఉండదన్న భావన ఉండేది. గతంలో బీసీలకు సంక్షేమ పధకాలు, రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండేది కాదు. ఇవన్నీ గమనించి ఎన్టీఆర్ పార్టీ పెట్టి బీసీల్ని, రాజకీయంగా, ఆర్దికంగా, సామాజికంగా ప్రోత్సహించారు. బీసీల్లో నాయకత్వ లక్షణాలు తీసువచ్చింది ఎన్టీఆర్. నేడు బీసీల్ని చంద్రబాబు నాయుడు అన్ని విధాల ఆదుకుంటున్నారు.
సమాజంలో మార్పుకు నాడు ఎన్టీఆర్ చేసిన పోరాటం వల్లే ఆర్దికంగా, రాజకీయంగా, సామాజకింగా బీసీల్లో మార్పు వచ్చింది. ఎన్టీఆర్, చంద్రబాబు టీడీపీ వల్లే మనం తలెత్తుకుని తిరగగలుగుతున్నాం. నేడు జగన్ రెడ్డి పెత్తందారి పాలన సాగిస్తున్నారు. పెత్తందారి పాలనను అంతమెందించేందుకు బీసీలు నడుం బిగించాలి. సమాజంలో 50 శాతం పైగా ఉన్న జనాభాను అణిచివేయాలని జగన్ రెడ్డి చూస్తున్నారు. ప్రతి సంక్షేమ పధకంలో బీసీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే. ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరగదు. జగన్ రెడ్డి స్వార్దం కోసం పనిచేస్తుంటే ...చంద్రబాబు నాయుడు సమాజం కోసం పని చేస్తున్నారు. జగన్ రెడ్డి లాంటిఅవినీతి పరుడు, దోపిడి దారుడు ఈ సమాజానికి పనికిరాడు’’ అని అన్నారు.