25 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ స్థానాలు- ఏమంటారు? చంద్రబాబు, పవన్ చర్చల్లో ఇదే హైలెట్
టికెట్ల అంశంలో భాగంగా ఆదివారం అధినేతల మధ్య కీలక సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత కీలక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని చెప్పుకుంటున్నారు.
Andhara Pradesh Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎన్నికల దిశగా స్పీడ్ అందుకున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల మార్పు ఇతరుల బుజ్జగింపులపై దృష్టి పెట్టింది. ఇప్పుడు టీడీపీ, జనసేన కూడా తమ అభ్యర్థుల అంశంపై ఫోకస్ పెట్టారు. ఆదివారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమై కీలకాంశాలు చర్చించారు. ఈ భేటీలో టికెట్ల అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పొత్తుపై ప్రకటన చేసిన టీడీపీ, జనసేన అప్పటి నుంచి పార్టీ సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రెండు పార్టీల కీలక నేతలు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేలా ప్లాన్ చేశారు. ఇరు వర్గాల మధ్య ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
టికెట్ల అంశంపై ఇప్పటి వరకు చర్చించింది లేదు. దీనిపై మీడియా సమావేశాల్లో ప్రశ్నలు ఎదురవుతున్నా దాటవేస్తూ వస్తున్నాయి ఇరు పార్టీలు ఎన్నికలు మరో మూడు నెలలు ఉన్నందున ఇకపై దీనిపై నాన్చివేత ధోరణి పనికి రాదని భావిస్తున్నారు ఇరు పార్టీల అధినేతలు.
టికెట్ల అంశంలో భాగంగా ఆదివారం అధినేతల మధ్య కీలక సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత కీలక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. జనసేనకు ఆంధ్రప్రదేశ్‌లో 25 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు ఇస్తామని చెప్పినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. దీనిపై పార్టీలో చర్చించి పవన్ కల్యాణ్ రిప్లై ఇస్తామని అన్నారట.
జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో 25 స్థానాలు ఇస్తామని వీటిలో ఈస్ట్ వెస్ట్‌లో ఎక్కువ ఉంటాయని చెప్పుకుంటున్నారు. భవిష్యత్ భేటీల్లో ఈ స్థానాలపై మరింత క్లారిటీ రానుంది. ఏ జిల్లాలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు.. ఎవరికి ఎన్ని సీట్లు, రెబల్స్ బెడద లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై మాట్లాడుకోనున్నారు.
పవన్ పోటీ ఎక్కడి నుంచి?
పవన్ కల్యాణ్ కూడా ఆ రెండు జిల్లాల నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. గతంలో ఆయన గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల కూడా ఓడిపోయారు. అయితే ఇప్పుడు కచ్చితంగా విజయం సాధించేలా పార్టీ బలంగా ఉన్న స్థానంలో పోటీ చేయాలని యోచిస్తున్నారట. అందుకు రెండు నియోజకవర్గాలను కూడా సెలెక్ట్ చేశారని చెప్పుకుంటున్నారు.
గాజువాక నుంచి పవన్ పోటీ చేసేందుకు ప్రస్తుతానికి డైలమాలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కచ్చితంగా దానికి బదులు పిఠాపురం, భీమవరం స్థానాల్లో ఒక చోట నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారట. ఇప్పటికే పార్టీ వర్గాలకు దీనిపై సమాచారం ఇచ్చారని అంటున్నారు.
ఇరు పార్టీల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పార్టీ పొత్తుల అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే సమావేశమైనట్టు మీటింగ్ తర్వాత జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘‘ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది. అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా, ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి..? దాని కోసం ప్రత్యేక వ్యూహంపైనా ఓ సమష్టి కార్యాచరణ తీసుకున్నాం. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించారు. వైసీపీని దీటుగా ఎదుర్కోవడమే కాకుండా, వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరం అయిన అన్ని విషయాల పట్ల పూర్తిస్థాయి చర్చ జరిగింది. అధినేతల మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలకమైన అంశాల గురించి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుతాం’’ అన్నారు.