Gun threats to KE Prabhakar: టీడీపీ నేతను గన్‌తో బెదిరించిన బీజేపీ నేత కుమారుడు - పోలీస్ కేసు - ఫ్యామిలీ గొడవలే!
KE Prabhakar: టీడీపీ నేతకేఈ ప్రభాకర్ ను ఆయన అల్లుడు గన్ తో బెదిరించారు. కుటుంబ వివాదాల కారణంగానే ఇది జరిగిందని భావిస్తు్న్నారు.

TDP leader KE Prabhakar was threatened with gun by his son in law: కర్నూలు టీడీపీ నేత కేఈ ప్రభాకర్ ను అభిషేక్ గౌడ్ అనే వ్యక్తి తుపాకీతో బెదిరించిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అక్టోబర్ 25న జరిగిన ఈ ఘటనపై ఆలస్యంగా వివరాలు బయటకు వచ్చాయి. అభిషేక్ గౌడ్ ..కేఈ ప్రభాకర్ అల్లుడు. ఆయన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు. గతంలో కేఈ ప్రభాకర్ కుమార్తెకు.. నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ కు పెద్దలు నిర్ణయించిన పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో కేఈ ప్రభాకర్ తన కుమార్తెకు కట్నంగా.. మణికొండలో ఓ ఫ్లాట్ ఇచ్చారు.
అఇతే ఇటీవల దంపతుల మధ్య వివాదాలు వచ్చాయి. విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రమంలో తమ కుమార్తెకు కట్నంగా రాసిచ్చిన ఫ్లాట్ ను ఖాళీ చేయాలని కేఈ ప్రభాకర్ డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే అభిషేక్ గౌడ్ అప్పటికే ఆ ఇంటిని ఇతరులకు లీజుకు ఇచ్చారు. వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అభిషేక్ గౌడ్.. కేఈ ప్రభాకర్ ను గన్ తో బెదిరించినట్లుగా తెలుస్తోంది. దీంతో కేఈ ప్రభాకర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అభిషేక్ గౌడ్ కోసం పోలీసులు అప్పటి నుంచి వెదుకుతున్నారు. ఆయన వద్ద ఉన్న వెపన్ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.తాజాగా ఆయన మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్నట్లుగా గుర్తించడంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.
నందీశ్వర్ గౌడ్ మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో కేఈ కుటుంబంతో వియ్యం అందుకున్నారు. తర్వాత నందీశ్వర్ గౌడ్ ఎక్కడా విజయం సాధించలేకపోయారు. గతంలో టీడీపీ పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పటాన్ చెరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయడానికి ఆయన టీడీపీలో చేరారు.అయితే ఆ స్థానం టీడీపీకి దక్కలేదు.తర్వాత ఆయన బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు.కానీ ఎక్కడా రాజకీయం కలసి రాకపోవడంతో ఫేడవుట్ అయ్యారు. ఆయన కుమారుడు అభిషేక్ గౌడ్ కూడా.. రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు. ఈ క్రమంలో దంపతుల మధ్య అభిప్రాయబేధాలు పెరిగిపోవడంతో.. విడిపోవాలని నిర్ణయించుకున్నా.. పెళ్లి సందర్భంగా చేసుకున్న కట్న కానుకల లావాదేవీల్లో వివాదాలు వస్తున్నాయి.
కేఈ ప్రభాకర్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ అంత యాక్టివ్ గా లేరు. కేఈ ప్రభాకర్ సోదరుడు కేఈ కృష్ణమూర్తి వయసు కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు శ్యామ్ బాబు పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేఈ ప్రభాకర్ కు పోటీ చేయడానికి గత ఎన్నికల్లో అవకాశం లభించలేదు.





















