Targeted killings a conspiracy by Pakistan: కశ్మీర్ లోయలో వరుస హత్యలు పాకిస్థాన్ కుట్రే: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
జమ్ము, కశ్మీర్‌లో వరుస హత్యలు పాకిస్థాన్ కుట్రేనని విరుచుకు పడ్డారు జమ్ము, కశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా. త్వరలోనే పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
లోయలో వరుస హత్యలు పాకిస్థాన్ కుట్రే: రవీందర్ రైనా
జమ్ము కశ్మీర్‌లో కొంత కాలంగా ఉగ్ర అలజడి మళ్లీ మొదలైంది. పండిట్ సామాజిక వర్గంతో సహా పలు వర్గాలకు చెందిన వారినే లక్ష్యంగా చేసుకుని హతమార్చుతున్నారు ఉగ్రవాదులు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సీనియర్ భద్రతాధికారులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. కశ్మీర్‌లో పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే జమ్ము, కశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లోయలో వరుస హత్యలు పాకిస్థాన్ కుట్రేనని తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఉగ్రవాదాన్ని నిర్మూలించి ప్రశాంత వాతావరణాన్ని సృష్టించాలన్న కేంద్రం లక్ష్యానికి దాయాది దేశం పాక్ కావాలనే అడ్డు తగులుతోందని ఆరోపించారు రవీందర్ రైనా. భద్రతా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉన్నారని, పాకిస్థాన్ ఆటలు చెల్లవని తేల్చి చెప్పారు. అలాంటి ఆలోచనలు మానుకోకపోతే దీటైన జవాబు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆపరేషన్ ఆలౌట్‌తో కేంద్రం ఉగ్రవాదుల్ని ఏరివేస్తోందని, ప్రజలకు భద్రత కల్పించటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌కు కడుపు మంట
అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న జమ్ము, కశ్మీర్‌ను చూసి పాకిస్థాన్‌కు కడుపు మంటగా ఉందని, అందుకే ఇలాంటి దాడులు చేయిస్తోందని రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కశ్మీర్‌లో ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ప్రారంభం కావడం దాయాది పాక్‌ను అసహనానికి గురి చేస్తోందని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ISI సహా ఆ దేశ సైన్యం కూడా ఈ దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ కుట్రకి వాళ్లు "ఆపరేషన్ రెడ్ వేవ్" అని పేరు పెట్టుకున్నారని వెల్లడించారు. పాకిస్థాన్... జమ్ము, కశ్మీర్ ప్రజలకు శత్రుదేశమని, అప్ఘనిస్థాన్‌లాంటి అనిశ్చితిని లోయలోనూ సృష్టించాలని చూస్తోందని మండిపడ్డారు రవీందర్ రైనా. ఈ వరుస హత్యలు చేస్తున్న ఉగ్రవాదులెవరైనా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
దశాబ్దాలుగా అరాచకాలు
జమ్ము, కశ్మీర్‌లో ప్రతి హత్య వెనక పాకిస్థాన్ హస్తం ఉందని అన్నారు. పాకిస్థాన్ మద్దతుతోనే ఉగ్రవాదులు దశాబ్దాలుగా అమాయక పౌరుల ప్రాణాలు తీస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర ముఠా నాయకులను భారత కమాండర్లు ఏరి పారేశారని, ఇకపై ఎలాంటి వ్యూహాలు పన్నినా వాటిని తిప్పికొడతామని జమ్ము, కశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా తేల్చి చెప్పారు.