Stalin Savings : స్టాలిన్ మహా పొదుపరి.. ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్న సీఎం...!
ఆర్థిక సమస్యల్లో ఉన్న తమిళనాడులో సీఎం పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే గిఫ్టులతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కట్ చేశారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఎమ్మెల్యేలకు పండగే పండగ. ఎందుకంటే ఎక్కడా లేని రాచమర్యాదలన్నీ ప్రభుత్వం వారికి కల్పిస్తుంది. అంతేనా అసెంబ్లీ సమావేశాల్లో వారికి ప్రత్యేకంగా గిఫ్టులు కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది. అవి చాలా ఖరీదైనవి అయి ఉంటాయి. కొత్తగా అసెంబ్లీ ఏర్పడిన సంవత్సరం అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు ఎమ్మెల్యేలకు ముఇఖ్యమంత్రి స్టాలిన్ గట్టి షాకిచ్చారు. అదేమింటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యేలకు కనీసం భోజనం ఏర్పాట్లు కూడా చేయలేదు. దీంతో ఎమ్మెల్యేలు.. వారి సిబ్బంది మొత్తం హడావుడిగా సొంత ఖర్చుతో భోజనాలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం ఎమ్మెల్యేలకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకూడదని స్టాలిన్ నిర్ణయించడమే.
తమిళనాట కొత్తగా స్టాలిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల కోసం ఎమ్మెల్యేలు అందరూ చెన్నై వచ్చారు. వారితో పాటు సహాయకులు.. అనుచరులు అందరూ వచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు తమకు ఎలాంటి సత్కారాలు జరుగుతాయో తెలుసు.. అందుకే.. దిలాసాగా వచ్చేశారు. అనుచరుల్ని తెచ్చుకున్నారు. బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఐఫోన్ లేదా మరో ఖరీదైన గిఫ్ట్ ప్రభుత్వం ఇస్తుందని ఆశ పడ్డారు. కానీ భోజనాలు కూడా తమ ఖర్చుతో తినాల్సి వస్తుందని అనుకోలేదు.
ఖర్చు లు తగ్గించుకోవడానికి ప్రజాప్రతినిధులపై అనవసరంగా ఖర్చు చేయకూడదని స్టాలిన్ నిర్ణయించుకున్నారు. అందుకే.. అసెంబ్లీ సమావేశాలకు అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు, వారి సహాయకులు... అందరూ ఎవరి భోజనాలు వారే ఏర్పాటు చేసుకోవాలని సమాచారం పంపారు. మామూలుగా అయితే ఒక్క పూటకు వెయ్యి మందికి భోజనాలను ప్రభుత్వం ఏర్పాటుచేసేది. అన్ని కూడా స్టార్ హోటళ్లకు ఆర్డర్స్ ఇచ్చేవారు. ఇలాంటి ఖర్చులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే కోట్లలో ఉండేవి. వీటన్నింటికీ స్టాలిన్ పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు కట్ చేసేశారు.
ముఖ్యమంత్రి అయినప్పటి నుండి స్టాలిన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉచిత పథకాల వల్ల తమిళనాడు ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారింది. అందుకే ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్తలను సలహాదారులుగా నియమించుకున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ను కూడా సలహాదారుగా నియమించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ.. తాను ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాల్సి ఉంది. అందుకే స్టాలిన్.. ప్రజా ప్రతినిధులపై చేసే ఖర్చును తగ్గించుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముందు ముందు మరిన్ని పొదుపు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.