SpaceX Starship Explodes: ఎలాన్ మస్క్ స్టార్ షిప్ ప్రయోగం విఫలం - నింగికెగసిన కొద్ది సేపటికే పేలిపోయిన రాకెట్ !
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ షిప్ ప్రయోగం విఫలమయింది. ఆకాశంలోకి ఎగసిన కొద్ది సేపటికే పేలిపోయింది.
SpaceX Starship Explodes: అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫెయిలయింది. అంతరిక్ష రంగంలో గొప్ప మలుపు అనుకున్న ప్రయోగం విఫలమయింది. టెక్సాస్‌లోని లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. స్టార్ షిప్ ఆకాశంలోకి ఎగిరిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. తాము ఎంతో నేర్చుకున్నామని తర్వాత ప్రయోగం కొద్ది నెలల్లో ఉంటుందని మస్క్ ప్రకటించారు. రాకెట్ లిఫ్ట్ ఆఫ్, బూస్టర్ వేరుపడటం, మళ్లీ అది భూమికి చేరుకోవడంపైనే దీని భవిష్యత్తు ఆధారపడి ఉందని స్పెస్ ఎక్స్ ప్రయోగానికి ముందు వివరించింది. కానీ లిఫ్ట్ ఆఫ్ అయిన వెంటనే పేలిపోవడంతో స్పేస్ ఎక్స్ కు భారీ నష్టం జరిగింది.
Congrats @SpaceX team on an exciting test launch of Starship!
— Elon Musk (@elonmusk) April 20, 2023
Learned a lot for next test launch in a few months. pic.twitter.com/gswdFut1dK
స్టార్ షిప్ పేలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SpaceX Starship explodes after launch#SpaceX
— Crime With Bobby (@crimewithbobby) April 20, 2023
pic.twitter.com/iSo1rIbear
మస్క్ యాజమాన్యంలోని స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్టార్ షిప్.. సూపర్ హెవీ స్పేస్ షిప్. అంతరిక్షంలోకి భారీ పేలోడ్స్‌ను తీసుకెళ్లడంతో పాటు కుజగ్రహంపైకి మనుషులను కూడా పంపించడానికి ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడేది. అంతరిక్ష పరిశోధనలను ఈ స్పేస్ షిప్ మలుపు తిప్పగలదని అనుకున్నారు. అన్ని రకాల పరీక్షలు చేసి.. ప్రయోగించినా ఫలితం విరుద్ధంగా వచ్చింది. ఫాల్కన్ 9 రాకెట్ల తయారీకి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే ఈ స్టార్ షిప్ సూపర్ హెవీ నిర్మాణానికీ వినియోగించారు. ఎన్నిసార్లయినా దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడానికి వీలుగా తీర్చిదిద్దారు. హెవీ పేలోడ్స్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టాలనేది దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా- చంద్రుడితో పాటు ఇతర గ్రహాలపైకి మనుషులను సైతం చేరవేసేలా ఈ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసినట్లు స్పేస్ ఎక్స్ వెల్లడించింది. కానీ ప్రయోగం విఫలమయింది.
పేలిపోయిన స్టార్ షిప్ తొలిదశ బూస్టర్‌లో 33 రాప్టార్ ఇంజిన్లను అమర్చారు. వాటిని మండించడానికి లిక్విడ్ మీథేన్, లిక్విడ్ ఆక్సిజన్‌ను వినియోగించారు. 160 టన్నుల బరువు ఉన్న కార్గోను అంతరిక్షంలోకి మోసుకెళ్లేలా రూపొందించారు. ఫాల్కన్-9 మెర్లిన్ ఇంజిన్‌తో పోల్చుకుంటే దీని ఇంజిన్ సామర్థ్యం రెండింతలు అధికం. రెండో దశలో ఆరు ఇంజిన్లు, మూడు రాప్టార్ ఇంజిన్లు, మరో మూడు రాప్టార్ వాక్యుమ్ ఇంజిన్స్ పెట్టారు.
ప్రైవేటు అంతరిక్ష రంగంలో స్పెస్ ఎక్స్ మంచి విజయాలు సాధించింది. ఈ సారి మరింత భారీ లక్ష్యాన్ని గురి పెట్టారు. చంద్రుడితో పాటు ఇతర గ్రహాలపైకి మనుషులను సైతం చేరవేసేలా ప్రయోగాలు చేస్తున్నారు. ఇది సక్సెస్ అయినట్లయితే అంతరిక్ష రంగంలో సంచలన మార్పులు వచ్చేవి. అయితే లోపాలు దిద్దుకుని మరి కొన్ని నెలల్లో మరోసారి ప్రయోగిస్తామని ఎలన్ మస్క్ ప్రకటించారు.