(Source: ECI/ABP News/ABP Majha)
South Central Railway Update: అల్లర్ల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే, ఏయే రైళ్లంటే..
అగ్నిపథ్ ఆందోళన నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది.
పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో దద్దరిల్లింది. నిరసనకారులు రాళ్లు రువ్వటం, పోలీసులు కాల్పులు జరపటం వల్ల ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తమయ్యాయి. మూడు రైళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఫలితంగా మిగతా రైళ్లన్నింటనీ ఎక్కడికక్కడే ఆపేశారు. రైల్వే స్టేషన్‌లో విద్యుత్ సరఫరానూ నిలిపివేశారు. కాచిగూడలో రైళ్లన్నీ ఆగిపోయాయి. ఆందోళనలు ఇంకా తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉత్తర మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఇంకొన్ని రైళ్లను మార్గం మళ్లించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దాదాపు 71 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. హౌరా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, సిర్‌పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్, గుంటూరు-వికారాబాద్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ట్విటర్‌లో వెల్లడించింది.
18046 హైదరాబాద్-షాలిమార్, 07078 ఉందానగర్-సికింద్రాబాద్, 07055 సికింద్రాబాద్-ఉందానగర్ రైళ్లను పూర్తిగా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్-రేపల్లె ట్రైన్‌ని తాత్కాలికంగా రద్దు చేసింది. షిర్డీ సాయినగర్-కాకినాడ పోర్ట్, భువనేశ్వర్-ముంబయి రైళ్లను మార్గం మళ్లించనున్నారు. అటు ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లనూ రద్దు చేశారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీస్‌లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
Partial Cancellation of Train Services @drmsecunderabad @drmhyb @VijayawadaSCR @drmgtl pic.twitter.com/jb1F01z1eP
— South Central Railway (@SCRailwayIndia) June 17, 2022
ఉత్తర మధ్య రైల్వే సర్వీసులపైనా ప్రభావం
అగ్నిపథ్ ఆందోళనల కారణంగా అటు ఉత్తర మధ్య రైల్వేకు సంబంధించిన పలు రైళ్ల సర్వీస్‌లూ ప్రభావితమయ్యాయి. హౌరా-న్యూదిల్లీ పూర్వా ఎక్స్‌ప్రెస్, హౌరా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్, దన్‌పూర్-టాటా ఎక్స్‌ప్రెస్, రాంచీ-పట్నా పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, ఆసన్‌సోల్-టాటా ఎక్స్‌ప్రెస్, జైనగర్-హౌరా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లపై ప్రభావం పడనుంది.
అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు. రైల్వేస్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది. రైల్వేస్టేషన్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. నిజానికి ముందుగానే ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
నిరసనలు ఆపి రైల్వేస్టేషన్‌ను ఖాళీ చేయకపోతే కాల్పులు చేస్తామని హెచ్చరించారు. అయినా మాట వినకపోవటం వల్ల చివరకు కాల్పులు జరిపారు. ఎన్ఎస్‌యూఐ సంఘాలు అల్లర్లకు కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమకు ఈ అల్లర్లు, విధ్వంసంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అగ్నిపథ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం వివరణ ఇస్తున్నా, దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు మాత్రం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ఘటనతో ఈ నిరసనలు కొత్త మలుపు తీసుకున్నాయి.