మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను, రాయ్‌బరేలీ ప్రజలకు సోనియా గాంధీ లేఖ
Sonia Gandhi: లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న సోనియా గాంధీ రాయ్‌బరేలీ ప్రజలకు ఎమోషనల్ లెటర్ రాశారు.
Sonia Gandhi Pens Letter: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, సీనియర్ నేత సోనియా గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు బాగానే వినిపించాయి. కానీ...ఆమె అసలు లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచే తప్పుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అప్పుడే నామినేషన్ కూడా వేశారు. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల పాటు తనను గెలిపించిన రాయ్‌బరేలీ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఓ భావోద్వేగ లేఖ రాశారు సోనియా గాంధీ. తమ కుటుంబానికి అండగా నిలబడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గం తమ జీవితంలో ఓ భాగమైపోయిందని వెల్లడించారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఇక్కడి ప్రజలు ఎంతో అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుందని, రాయ్‌బరేలీకి వచ్చిన ప్రతిసారీ ఆ లోటు తీరిపోతుందని స్పష్టం చేశారు. రాయ్‌బరేలి నుంచి పోటీ చేయడం తనకెంతో గర్వంగా అనిపించిందని, ఇక ముందు కూడా ఇదే విధంగా తమ కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలే అని వెల్లడించారు. ఆరోగ్య సమస్యలు, వయసురీత్యా లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
"ఢిల్లీలో ఉంటే మాకు ఏదో వెలితిగా అనిపిస్తుంది. రాయ్‌బరేలీకి వచ్చిన ప్రతిసారీ ఆ లోటు తీరిపోతుంది. ఈ బంధం ఇప్పటిది కాదు. మా అత్త,మామల నుంచి నాకు లభించిన ఆస్తి ఈ అభిమానం. మా కుటుంబ మూలాలన్నీ రాయ్‌బరేలీలోనే ఉన్నాయి. మా కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి ఎంపీలుగా గెలిపించారు. అప్పటి నుంచి ఈ బంధం కొనసాగుతూనే ఉంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా మా ప్రయాణం సాఫీగా సాగిపోయింది. ఎలాంటి దారిలో అయినా నడిచే ధైర్యాన్ని ఇచ్చింది మీరే. నాపై మీరు చూపించిన ప్రేమని ఎప్పటికీ మరిచిపోలేను. ఇవాళ నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీరేనని గర్వంగా చెబుతున్నాను. ఆరోగ్య సమస్యలు, వయసు రీత్యా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నాను. నా మనసు మాత్రం ఎప్పుడూ మీతోనే ఉంటుంది"
- సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी का रायबरेली की जनता के नाम संदेश- pic.twitter.com/6zlJkWjwvi
— Congress (@INCIndia) February 15, 2024
కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో సోనియా గాంధీ కూడా ఉన్నారు. ఆమె తెలంగాణలో లోక్‌సభకు పోటీ చేస్తారన్న వార్తలు వచ్చినా...ఆమె రాజ్యసభకు పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్ నుంచి సోనియా బరిలోకి దిగుతున్నారు. ఆమెతో పాటు బిహార్ నుంచి డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి శ్రీ అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోర్‌ని అభ్యర్థులుగా ప్రకటించారు.
Also Read: క్యాన్సర్‌కి వ్యాక్సిన్ తయారు చేస్తున్న రష్యా, త్వరలోనే అందుబాటులోకి