Bharat Ratna 2024: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారతరత్న, సోనియా గాంధీ స్పందన ఇదే
Bharat Ratna 2024: పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వడంపై సోనియా గాంధీ స్పందించారు.
Bharat Ratna Awards 2024: దేశ మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహారావుతో పాటు చౌదరి చరణ్ సింగ్‌కి భారతరత్న అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఇద్దరితో పాటు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్‌ఎస్ స్వామినాథన్‌నీ ఈ అవార్డుతో సత్కరిస్తున్నట్టు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా X వేదికగా ఈ ప్రకటనలు చేశారు. ఆర్థిక సంస్కరణలతో దేశ రూపురేఖల్ని మార్చిన పీవీ నరసింహారావుని కాంగ్రెస్ ఎప్పుడూ సరిగ్గా గౌరవించలేదని పదేపదే మోదీ సర్కార్ విమర్శిస్తూనే ఉంటుంది. ఆయన అంత్యక్రియల్నీ సరిగ్గా చేయలేదని పడుతుంటుంది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం కీలకంగా మారింది. అయితే...ఈ అవార్డులపై కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. పార్లమెంట్ బయట మీడియా ఆమెని మాట్లాడించేందుకు ప్రయత్నించారు. పీవీ నరసింహారావుతో పాటు చరణ్ సింగ్, స్వామినాథన్‌కి భారతరత్న ఇవ్వడంపై మీ స్పందన ఏంటని ప్రశ్నించారు. అందుకు ఆమె "ఇది స్వాగతించాల్సిన విషయమే..ఇందులో కాదనడానికి ఏముంది" అని సమాధానమిచ్చారు.
#WATCH | Delhi: Chaudhary Charan Singh, PV Narasimha Rao Garu and M S Swaminathan conferred with the Bharat Ratna.
— ANI (@ANI) February 9, 2024
Congress Parliamentary Party president Sonia Gandhi says, "I welcome it." pic.twitter.com/Sk61F8IZAY
పీవీ నరసింహారావుకి భారతరత్న ప్రకటించడంపై కేంద్రహోం మంత్రి అమిత్ షా స్పందించారు. రాజనీతిజ్ఞత కలిగిన ఇలాంటి వ్యక్తికి ఈ అత్యున్నత పురస్కారం అందించడం సముచితం అంటూ ప్రశంసించారు. ప్రధాని మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ దుర్భర పరిస్థితిలో ఉన్నప్పుడు పీవీ నరసింహారావు దేశానికి దిక్సూచిగా మారారని వెల్లడించారు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని స్పష్టం చేశారు.
Bharat Ratna to Former Prime Minister PV Narasimha Rao Garu is a befitting tribute to the legendary statesman who shaped the history of our nation with an iconoclastic vision, intellect, and statesmanship. The contributions of PV Narasimha Rao Ji in navigating our economy safely… pic.twitter.com/ygfD2WC5ub
— Amit Shah (@AmitShah) February 9, 2024
ఈ అవార్డు ప్రకటించిన సమయంలో పీవీ నరసింహా రావు ఓ మేధావి అంటూ ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్రమంత్రిగానూ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారని అన్నారు. అటు ఎంపీగానూ ఎన్నో ఏళ్లుగా సేవలందించారని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన వ్యక్తి అంటూ కొనియాడారు. దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని అన్నారు. ప్రధానిగా ఆయన అందించిన సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని వెల్లడించారు. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కీ భారతరత్న ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. దేశానికి ఆయన అందించిన సేవలకు లభించిన సత్కారమని వెల్లడించారు.
Also Read: Bharat Ratna 2024: కిసాన్ ఛాంపియన్ చరణ్ సింగ్‌కి భారతరత్న, జీవితమంతా రైతులకే అంకితం