29వ అంతస్తు నుంచి దూకిన స్కై డైవర్, పని చేయని పారాచూట్ - కింద పడి మృతి
Skydiver Death: థాయ్‌లాండ్‌లో బ్రిటీష్ స్కై డైవర్ 29వ అంతస్తు పై నుంచి దూకి ప్రమాదావశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.
Skydiver Falls to Death: థాయ్‌లాండ్‌లో బ్రిటీష్ స్కై డైవర్ (Skydiver) ప్రమాదావశాత్తు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. 29 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకిన సమయంలో పారాచూట్ తెరుచుకోలేదు. ఫలితంగా అదుపు తప్పి చెట్టుకి బలంగా ఢీకొట్టాడు. ఆ తరవాత కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. 33 ఏళ్ల Nathy Odinson థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో 29 అంతస్తుల బిల్డింగ్‌పైకి ఎలాంటి అనుమతి లేకుండానే ఎక్కినట్టు అధికారులు వెల్లడించారు. అపార్ట్‌మెంట్ ముందు కార్ ఆపి ఎవరి దగ్గరా అనుమతి తీసుకోకుండానే నేరుగా లోపలికి వెళ్లాడు. మెట్లు ఎక్కుతూ 29వ అంతస్తు వరకూ వెళ్లాడు. కింద నుంచి తన ఫ్రెండ్‌ని వీడియో తీయమని చెప్పాడు. పారాచూట్ పెట్టుకున్నాడు. కౌంట్‌డౌన్ పూర్తయ్యాక ఒక్కసారిగా పై నుంచి దూకాడు. ఆ సమయంలోనే పారాచూట్ పని చేయలేదు. అదుపు తప్పి కింద పడిపోయాడు. పట్టాయా పోలీసులకు ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ బిల్డింగ్ వద్దే ఓడిన్సన్ బాడీని గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ఈ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ ఈ ప్రమాదంపై స్పందించాడు. గతంలోనూ చాలా సార్లు ఇలాగే బిల్డింగ్ పై నుంచి దూకాడని చెప్పాడు. కింద వెళ్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేశాడని పోలీసులకు వివరించాడు.
"పై నుంచి దూకినప్పుడు పారాచూట్ సరిగా పని చేయలేదు. సరిగ్గా దిగాల్సిన చోట దిగలేదు. అందుకే ప్రమాదం జరిగింది. ఈ వీడియో తీసిన స్నేహితుడినీ విచారిస్తున్నాం. ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోరెన్సిక్ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. పారాచూట్‌నీ పరిశీలిస్తున్నారు"
- పోలీసులు
Nathy's Sky Photography పేరుతో ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే వాడు ఓడిన్సన్. కొంతమంది కస్టమర్స్‌ని స్కైడైవింగ్‌కి తీసుకెళ్లేవాడు. నాతీ చనిపోయాడన్న విషయాన్ని యూకేలోని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
స్కై స్క్రాపర్ మృతి..
అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో ఎక్స్‌పర్ట్ అయిన ఫ్రాన్స్ కి చెందిన రెమీ లుసిడి (Remi Lucidi) గతేడాది జులైలో ప్రమాదవశాత్తు 68వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహిస్తూ.. ప్రమాదాలతో చెలగాటమాడడం (Daredevil) అతడికి సరదా. ఆ సరదానే ఇప్పుడు అతడి ప్రాణాలను కోల్పోయేలా చేసింది. రెమీ లుసిడి అనుమతులు లేకుండా ఓ భవంతిపై నుంచి అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకొంది. హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌ను అధిరోహించేందుకు ప్రయత్నించాడు. 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్ కిటికి బయట చిక్కుకుపోయాడు. భయంతో ఆ కిటికీని బలంగా తన్నాడు. ఇరుక్కుపోయిన లుసిడిని చూసిన ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చే లోపే రెమీ కాలు పట్టు తప్పింది. నేరుగా కిందపడిపోయి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఓ సాహసికుడిగా రెమీ లుసిడి పేరు చరిత్రలో నిలిచి ఉంటుందని అంటున్నారు అభిమానులు. అయితే ఇటువంటి సాహసాలను చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
Also Read: Budget 2024: పన్నుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు - ఇండస్ట్రీ కోర్కెలు చాలా ఉన్నాయి!