Sikkim Floods: సిక్కిం వరదల్లో 14 మంది మృతి, 102 మంది గల్లంతు
Sikkim Floods: సిక్కిం ఉత్తర ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటికి 14 మంది మరణించారు. 22 మంది ఆర్మీ సిబ్బంది సహా 102 మంది పౌరులు గల్లంతయ్యారు.
సిక్కిం ఉత్తర ప్రాంతంలో సంభవించిన మంగళవారం రాత్రి సంభవించిన కుంభవృష్టి వర్షం, ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటికి 14 మంది మరణించారు. 22 మంది ఆర్మీ సిబ్బంది సహా 102 మంది పౌరులు గల్లంతయ్యారు. లోనాక్ సరస్సు ప్రాంతంలో భారీ వర్షాలు కరువడంతో తీస్తా నదిలో వరద పోటెత్తింది. దీనితో పాటు చుంగ్ థాంగ్ డ్యామ్ నుంచి కూడా నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పెరిగింది. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తప్పిపోయిన 23 మంది సైనికులలో ఒకరిని రక్షించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. సైనికుల జాడ కోసం భారత ఆర్మీకి చెందిన త్రిశక్తి కార్ప్స్ దళాలు రెస్యూ ఆపరేషన్ చేపట్టాయి.
వరదల కారణంగా దాదాపు 14 వంతెనలు కూలిపోయాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని అక్కడి ప్రభుత్వ అధికారి వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున సంభవించిన కుంభవృష్టి వర్షం కారణంగా అయిన చుంగ్‌థాంగ్ వద్ద ఉన్న ఆనకట్ట కొన్ని ప్రాంతాల్లో కొట్టుకుపోయింది. ఇక్కడే రాష్ట్రంలోని అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది. ఈ డ్యామ్ నుంచి నీరు కిందకు ప్రవహించడంతో నీటిమట్టం పెరిగి అర్ధరాత్రి మెరుపు వరదలు వచ్చాయి. దీంతో ప్రజలు అతలాకుతలమయ్యారు. సింగ్తమ్ ప్రాంతంలో అయిదు మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. చుంగ్‌థాంగ్ వద్ద తీస్తా స్టేజ్ 3 డ్యామ్‌లో పనిచేస్తున్న దాదాపు 14 మంది కార్మికులు అక్కడి సొరంగాల్లో చిక్కుకుపోయారు.
సిక్కిం ప్రభుత్వం ఈ వరదలను విపత్తుగా ప్రకటించింది. తెగిపోయిన 14 వంతెనలలో తొమ్మిది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పరిధిలో ఉన్నాయని, ఐదు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివని అధికారులు తెలిపారు. ఈ వంతెనలు తెగిపోవడం వల్ల రవాణా ఆగిపోయి దాదాపు మూడు వేల మంది పర్యాటకులు సిక్కింలోనే ఉండి పోయి భయం భయంగా గడుపుతున్నారని, తగిన సహాయక చర్యలు చేపడుతున్నామని ఓ అధికారి తెలిపారు. తీస్తా నది ఉగ్రరూపం ధాటికి సింగ్తమ్ వద్ద ఉక్కు వంతెన కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. పశ్చిమబెంగాల్, సిక్కింలను కలిపే 10వ నెంబరు జాతీయ రహదారి కొట్టుకుపోయింది. తీస్తా నది ప్రభావంతో ఉత్తర బెంగాల్‌లోనూ దాదాపు పది వేల మందికి పైగా ప్రజలను లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సహాయక శిబిరాలకు పంపించారు.
వరదల కారణంగా ఫైబర్ కేబుల్ లైన్స్ ధ్వంసమయ్యి చుంగ్‌థాంగ్ సహా ఉత్తర సిక్కింలోని పలు ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్, బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు అంతరాయం ఏర్పడింది. చుంగ్‌థాంగ్‌లోని పోలీస్ స్టేషన్ కూడా వరదల్లో నాశనమైపోయింది. ఎడతెగని వర్షాలతో పాటు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు చాలా కష్టంగా మారింది. తప్పిపోయిన వారి కుటుంబసభ్యులను సంప్రదించి పరిస్థితి గురించి తెలియజేస్తున్నామని అధికారులు తెలిపారు. సిక్కిం, ఉత్తర బెంగాల్‌లో విధుల్లో ఇతర ఆర్మీ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, మొబైల్ నెట్‌వర్క్ సమస్య కారణంగా కుటుంబసభ్యులను సంప్రదించలేకపోతున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు.
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నానని తెలిపారు. సింగ్టమ్‌ను సందర్శించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సేవలు అందిస్తున్నామని, నష్టాలను అంచనా వేయడానికి స్థానిక అధికారులతో మాట్లాడుతున్నాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.