Shiv Sena Symbol Crisis: 'శివసేన' ఎన్నికల గుర్తు కోసం ఠాక్రే న్యాయ పోరాటం!
శివసేన ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టులో ఉద్ధవ్ ఠాక్రే వర్గం పిటిషన్ దాఖలు చేసింది.
Shiv Sena Symbol Crisis: శివసేన పార్టీ పేరును, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఫ్రీజ్ చేసింది. దీంతో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఉప ఎన్నికకు
అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. దీంతో పోటీకి ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్‌నాథ్ శిందే వర్గం కొత్త పేర్లు, గుర్తులను ఎంచుకోవాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశం మేరకు రెండు వర్గాలు ఇప్పటికే కొత్త పేర్లు, గుర్తులకు సంబంధించిన ఆప్షన్‌లను ఈసీకి సమర్పించాయి.
ఎవరిది అసలైన శివసేన అనే విషయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అసలైన శివసేన మాదంటే, మాదేనంటూ రెండు వర్గాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం.. శివసేన పార్టీ పేరును, గుర్తును ఇటీవల ఫ్రీజ్ చేసింది.
ఇలా జరిగింది
అయితే అసలైన శివసేన తమదే అని నిరూపిస్తూ ఆగస్టు 8లోగా డాక్యుమెంటరీలు సమర్పించాలని గతంలోనే ఈసీ రెండు వర్గాలను ఆదేశించింది. అయితే ఠాక్రే వర్గం అభ్యర్థనతో గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అయితే, ఉప ఎన్నికల్లో పోటీ కోసం తమకు శివసేన విల్లు బాణం గుర్తు కేటాయించాలని శిందే వర్గం ఈసీని అభ్యర్థించింది.
దీంతో శిందే వర్గం అభ్యర్థనపై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని కోరింది. ఈ క్రమంలో ఉద్దవ్ వర్గం శనివారమే ఈసీకి తమమ స్పందన తెలియజేసింది. శిందే వర్గం డాక్యుమెంటేషన్ క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు నాలుగు వారాల సమయం కావాలని కోరింది.
పెద్ద యుద్ధమే
శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో ఇరు వర్గాలు ఎప్పుడో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. తమదే నిజమైన శివసేన అని ఏక్‌నాథ్ శిందే వర్గం చెప్పటంతో పాటు, శివసేన
పార్టీ గుర్తుని తమకే ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే విచారణ తేలేంత వరకూ ఎన్నికల సంఘం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సుప్రీం కోర్టు గతంలో తేల్చి చెప్పింది. అనంతరం ఈ అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఇంకా శివసేన ఎవరిది అన్న చర్చ వాడివేడిగా సాగుతూనే ఉంది. ఈ అంశంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎన్నోసార్లు స్పందించారు. బాలాసాహెబ్ స్థాపించిన శివసేనను కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. 56 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఇలా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Modi on Kashmir Issue: 'ఆయన ఆ ఒక్కటి కూడా చేయలేకపోయారు'- నెహ్రూపై మోదీ విమర్శలు!
Also Read: Russia Ukraine War: 'ఇది ట్రైలర్ మాత్రమే- మా జోలికి వస్తే రియాక్షన్ తీవ్రంగా ఉంటుంది'